న్యూఢిల్లీ: టికెట్ బుకింగ్ సందర్భంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోని ప్రయాణికులు ఇకపై ఆన్‌బోర్డ్‌లో కూడా ఆహారపానీయాలు కొనుక్కోవచ్చని రైల్వే బోర్డు శుక్రవారం తెలిపింది. వందేభారత్ ప్రయాణికులలో బుకింగ్ సమయంలో కేటరింగ్ సదుపాయాన్ని ఎంచుకున్నవారు, ఎంచుకోని వారు ఉభయులు రైలులో వాటిని పొందవచ్చు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సిటిసి) త్వరలో ఫుడ్ ఐటెమ్స్ సర్వీస్‌ను పునరుద్ధరించబోతోంది. ఈ మేరకు ఐఆర్‌సిటిసి శుక్రవారం ఓ సర్కూలర్‌ను జారీచేసింది. రెడీ టు ఈట్(ఆర్‌టిఈ) ఆప్షన్‌తో పాటు వండిన ఆహారంను(ఒకవేళ ఉంటే) ప్రయాణీకులు పొందొచ్చు. ఇది కరెంట్ బుకింగ్ ప్రయాణికులతో పాటు, నాన్‌ఆప్టీ ప్రయాణీకులకు కూడా వర్తిస్తుంది.
చాలా మంది ప్రయాణికులు తాము డబ్బు చెల్లిస్తామన్నా… టికెట్ బుక్ చేసుకునేప్పుడు ముందుగా బుక్ చేసుకోనందున ఆహారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేస్తున్నారని రైల్వే అధికారులు చెబుతున్నారు. ‘చాలా మంది ప్రయాణికులు టికెట్ బుకింగ్ చేసుకునేప్పుడు ప్రీపెయిడ్ ఫుడ్ ఆప్షన్‌ను ఎంచుకోరు. కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఏదైనా తినాలి, త్రాగాలి అనిపిస్తుంది. ముందుగా బుక్ చేసుకోనందుకు వారికి లేదనడం సరికాదు. ముందుగా బుక్ చేసుకోనందున ఐఆర్‌సిటిసి సిబ్బంది ప్రయాణికులు కోరుకున్నా ఇవ్వడం లేదు. వారు డబ్బు చెల్లిస్తామన్నా వినడంలేదు. ఇప్పుడు పాలిసీ మారింది. నాన్‌ఆప్టీలకు కూడా నాణ్యమైన ఆహారపానీయాలు రైలులో అందించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని ఓ రైల్వే అధికారి తెలిపారు. అయితే రాత్రి తొమ్మిది తర్వాత అమ్మకాలు లేదా డిన్నర్ సర్వీస్ ఆర్డర్ తీసుకోవడం ఉండదన్నది ఇక్కడ గమనార్హం.