ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తెరలేవనుంది. ఈ నెల 27న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలను మొత్తం 15 పని దినాల పాటు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత సభ జరిగే రోజుల సంఖ్యపై స్పష్టత రానుంది. ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో, సభకు పూర్తి స్థాయి సబ్జెక్టుతో సిద్ధమై రావాలని సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు.
పోటీ కోసమే ర్యాంకులు – ఎవరినీ తక్కువ చేయడానికి కాదు : సీఎం చంద్రబాబు
అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితే తప్ప విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టీమ్ వర్క్‌గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తాను విశ్వసిస్తానని అన్నారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రుల ర్యాంకులపై గురువారం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్‌తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే తమ ఆలోచనగా పేర్కొన్నారు. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామని తెలిపారు. దస్త్రాల పరిష్కారంలో నిన్న విడుదల చేసిన ర్యాంకులు ఎవరినీ ఎక్కువ చేయడానికి కాదన్నారు. ఎవరినీ తక్కువ చేయడానికి కాదని సీఎం స్పష్టం చేశారు.
ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది చెప్పడం ద్వారా తమతో తాము పోటీ పడటంతో పాటు, ఒకరితో ఒకరు పోటీ పడి పని చేయడానికి, పాలనలో వేగం పెంచేందుకు చేసిన ప్రయత్నమే ఇదని తెలిపారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తాను కూడా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉందన్నారు. ప్రజలు అపారమైన నమ్మకంతో 2024 ఎన్నికల్లో 93 స్ట్రైక్ రేట్‌తో చారిత్రాత్మక తీర్పును ఇచ్చి గెలిపించారని వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు తొలిరోజు, తొలిగంట నుంచి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నేను కూడా నా స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది. ‘పీపుల్ ఫస్ట్’ విధానంతో నేను, నా క్యాబినెట్ సహచర మంత్రులమంతా పనిచేస్తున్నాం. లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నాం. గ్రామ స్థాయిలో చిరు ఉద్యోగి నుంచి సీఎం వరకు అంతా కష్టపడి సమష్టిగా పనిచేస్తేనే ప్రజల సమస్యలు, కష్టాలు తీర్చి సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టగలమని, ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో శాఖల్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.