కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి జరగబోయే ఎన్నికల పట్ల ఆసక్తి తప్ప, మొత్తం దేశాన్ని సమగ్రాభివృద్ధి వైపు తీసుకెళ్లాలనే ఆలోచనలు ఉన్నట్లు కనిపించడం లేదు. బిజెపి, బిజెపి భాగస్వామ్య ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలను గురించి పట్టించుకోవడం లేదు. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో మరోసారి తెలంగాణ పట్ల తమ నిర్లిప్తతను, విద్రోహ వైఖరితోపాటు తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శించారు. లోక్‌సభలో రూ. 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేళపెట్టగా, దేశ స్థూల జాతీయోత్పత్తిలో 5 శాతానికి మించి సమకూరుస్తున్న తెలంగాణకు ప్రత్యేకంగా ఎటువంటి కేటాయింపులు జరపకుండా మొండిచేయి చూపారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టునుగానీ, కార్యక్రమాన్నిగానీ ప్రకటించలేదు. విభజన చట్టం హామీల మేరకు రావాల్సిన ప్రాజెక్టులకు సైతం ఒక్క నయాపైసా నిధులను కూడా కేటాయించలేదు.
బడ్జెట్లో ఈసారైనా రాష్ట్రానికి అదనపు నిధులు దక్కుతాయని, తగిన తోడ్పాటు లభిస్తుందని తెలంగాణ ప్రజలు ఆశలు నిరాశగానే మిగిలింది. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర నిధులు మినహా అదనంగా ఏమీ కేటాయించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయిస్తుందన్న విశ్వాసంతో ఎదురు చూసిన రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచినట్లయింది. విభజన చట్టంలోని పెండింగ్ హామీలతో పాటు కొత్త ప్రాజెక్టులకు తగిన నిధులు ఇస్తారని పెట్టుకున్న ఆశలు నిరాశగా మిగిలాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ‘పెద్దన్న’ అంటూ గౌరవించి, పలు పర్యాయాలు ఢిల్లీ వెళ్లి ఆయననే కాకుండా, పలువురు కేంద్ర మంత్రులను సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి తెలంగాణ అవసరాల గురించి వివరించినా బడ్జెట్లో ఎటువంటి స్పందన కనిపించలేదు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రూ.1.63 లక్షల కోట్ల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. వాటిల్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపడమే అవుతుంది.
తెలంగాణ నుండి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇక్కడి నుండి ఎన్నికైన ఎనిమిది మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికైన తెలంగాణకు చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నారు. వారెవ్వరూ కూడా కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా, ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటుంటే ఇది ‘కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ కాదు’ అంటూ తమ అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ కాకపోతే ఎన్నికలు జరుగుతున్న బీహార్‌కు మాత్రమే ప్రత్యేకంగా ఎన్నో వరాలు ప్రకటించడాన్ని తెలంగాణ ప్రజలు చూడటం లేదనుకుంటున్నారా? ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు ప్రతిపాదనలు చేశారని మీడియా మొత్తం కోడై కూస్తుంది గదా! ఎన్నికల రాజకీయాలు తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోని బిజెపి నాయకుల అవకాశవాద రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని మరచిపోవద్దు.
రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ, మూసీ పునర్జీవం, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నవోదయ, కేంద్రీయ విద్యాలయాల మంజూరు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలని, కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దుష్టంగా ప్రతిపాదనలు పంపింది. చివరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాలను సైతం కేంద్రం పూర్తిగా పక్కనపెట్టింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ప్రస్తావన ఈసారి కూడా బడ్జెట్ లో చోటు చేసుకోలేకపోవడం దురదృష్టకరం. పది కొత్త గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల అభివృద్ధి, బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్, గోదావరి-మూసీ నదుల అనుసంధానం, హైదరాబాద్ అభివృద్ధి, నగరంలో సీవరేజీ మాస్టర్ ప్లాన్‌తో పాటు వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కోరింది. వేటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో స్పందించనే లేదు.
చెప్పుకోవడానికి తెలంగాణ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదని స్పష్టమైంది. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ బడ్జెట్ కసరత్తు జరుగుతున్న సమయంలోనే రాష్ట్రానికి ఏం కావాలి? గతంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన పథకాలేమిటి?వాటి కార్యాచరణ తీరుతెన్నులు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు ఏమిటి? వంటి వాటిపై ఎప్పుడూ దృష్టి సారించిన దాఖలాలు లేవు. వారెన్నడూ రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పట్టించుకున్న దృష్టాంతాలు లేకపోగా, ప్రశాంతంగా జీవిస్తున్న తెలంగాణ ప్రజల్లో విభజన తీసుకురావడానికి కులాలను, మతాలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం శోచనీయం.
బందరు పోర్టు నుంచి హైదరాబాద్ డ్రై పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రోడ్డును మంజూరు చేయాలని, హైదరాబాద్‌లో సెమీకండక్టర్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా మెట్రోరైలు ప్రాజెక్టులకు బడ్జెట్లో రూ. 31 వేల కోట్ల కేటాయింపులు జరిగాయి. కానీ అందులో హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టును చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని ఆశ్రయించి నిధులు మంజూరు చేయాలని కోరినా ప్రయోజనం లేకపోయింది.ఐఐటి, ట్రైబల్ యూనివర్శిటీ వంటి ఉన్నత విద్యాసంస్థలు, ఎయిమ్స్ వంటి వాటికి గతంలో నేరుగా బడ్జెట్లో కేటాయింపులు జరిపినా ఈ ఏడాది ఎటువంటి కేటాయింపులు జరపలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఐటి, ఐఐఎం, ఐఐఐటి, నవోదయ, సైనిక్ స్కూల్స్‌ను పట్టించుకొననేలేదు. బహుశా మొత్తం దేశంలోనే హైదరాబాద్ మినహా చెప్పుకోదగిన మరో విమానాశ్రయం లేని పెద్ద రాష్ట్రం తెలంగాణ మాత్రమే. రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా కేంద్ర బడ్జెట్లో ఒక్కదానికి కూడా నిధులు కేటాయించలేదు.
తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటా, కేంద్ర ప్రత్యేక పథకాల గ్రాంట్ల విషయంలో రాష్ట్రానికి ప్రతీసారి అన్యాయమే జరుగుతోందని, ఈ సారైనా న్యాయం చేస్తారని రాష్ట్ర ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ఎన్నికలు జరిగే, ఎన్‌డిఎ పార్టీ రాష్ట్రాలకే నిధులు ఇచ్చారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు మొండిచేయి చూపడం బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తుంది. తాజా బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సూక్ష్మపరిశీలన చేయగా ఏ శాఖ ద్వారా కూడా తెలంగాణ ప్రత్యక్ష ప్రయోజనాలు పొందే పథకాలు, కార్యక్రమాలు కనిపించలేదు. అయినా, ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణ భాగస్వామి’ అంటూ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు సర్దిచెప్పుకుంటూ రాష్ట్ర ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపట్ల వివక్ష చూపుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో కీలక భాగస్వామి బిజెపిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ క్షమించరని గ్రహించాలి. నూతన రాష్ట్రమైన తెలంగాణపై కేంద్రం పక్షపాత వైఖరితో కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఇప్పుడు మరోసారి తేటతెల్లమైంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు నివేదికలే తెలంగాణకు శాపంగా మారాయి. పలు పథకాల క్రింద ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి.
రాష్ట్రంలో 1059 గ్రామాలు, ఆవాసాల్లో మిషన్ భగీరథ వ్యవస్థ ఏర్పాటు కాకున్నా మిషన్ భగీరథ వంద శాతం పూర్తయినట్లు తప్పుడు నివేదికలు కేంద్రానికి బిఆర్ఎస్ ప్రభుత్వం సమర్పించడం వల్లే గ్రామీణ తాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవకాశాన్ని రాష్ట్రం కోల్పోతున్నది. కాగా, 60 ఏళ్లు దాటిన రైతులకు నెలవారీ పింఛన్లు అందిస్తామని, ఆరు ఏండ్ల కింద హామీ ఇచ్చిన కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో కూడా పింఛన్ల ప్రస్తావన చేయలేదు. ఆదాయపన్ను రాయితీ పరిమితిని పెంచడం హర్షణీయమే అయినప్పటికీ ప్రజల ఆదాయాలు పెరిగే అవకాశాలు లేకపోవడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతూ ఉండటం కారణంగా ప్రజలలో కొనుగోలుశక్త్తి తగ్గిపోతూ ఉండటం, ద్రవ్యోల్బణం కారణంగా ప్రజాజీవనం కల్లోలంలో చిక్కుకుపోవడాన్ని బడ్జెట్ పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఉత్పత్తి రంగం పుంజుకుంటే గాని ఉపాధి అవకాశాలు పెరగవు. ఆ దిశలో మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా తీవ్ర వైఫల్యం చెందుతున్నది.
వ్యవసాయ రంగం పట్ల ఈ బడ్జెట్ పూర్తి వివక్ష చూపుతున్నది. సాగునీటి ప్రాజెక్టులకు, రైతుల ఆదాయం పెంపుదలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనే లేదు. ఎరువుల సబ్సిడీ గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే రూ. 3,412 కోట్లు తగ్గించారు. ఇది వ్యవసాయ రంగం, రైతుల మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆహార సబ్సిడీని తగ్గించింది. ఇది పేదల జీవితాల మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. గత ఏడాది బడ్జెట్లో వివిధ పథకాల క్రింద కేటాయించిన రూ. 70,000 కోట్లకు పైగా నిధులలో ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు. ప్రభుత్వ విధానాల కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై, ఆహారభద్రత ప్రమాదంలోపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికైనా తెలంగాణలోని బిజెపి మంత్రులు, ఎంపిలు, ఇతర నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, పథకాలు కోసం కేంద్రం నుండి అవసరమైన నిధులు తీసుకువచ్చేందుకు తమ పలుకుబడిని ఉపయోగించాలి. తెలంగాణ ప్రజల అవసరాలకోసం తమ గళం విప్పాలి. లేని పక్షంలో తెలంగాణలో రాజకీయంగా తమ ఉనికి ప్రశ్నార్థకం కాగలదని గ్రహించాలి.
మహేశ్ కుమార్ గౌడ్ (ఎంఎల్‌సి, టిపిసిసి అధ్యక్షులు)