మన తెలంగాణ/ క్రీడా విభాగం: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో రోహిత్‌కు కళ్లు చెదిరే రికార్డు ఉంది. వన్డేల్లో సెంచరీ చేయడమే గొప్ప అంటే అతను మూడు సార్లు డబుల్ సెంచరీలతో కదం తొక్కా డు. దీన్ని బట్టి అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ కొంత కాలంగా రోహిత్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమవుతున్నాడు. ఇటీవల న్యూ జిలాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టు సిరీస్‌లలో విఫలమయ్యాడు. అంతకుముందు జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ తేలిపోయాడు. ఫామ్‌ను అందిపుచ్చుకునేందుకు ముంబై తరఫున రంజీల్లో సయితం ఆడాడు. అయితే రంజీలో కూడా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఘోర వైఫల్యం చవిచూశాడు.
తాజాగా ఇంగ్లండ్‌తో నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కూడా తేలిపోయాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. ఏడు బంతులు ఆడి రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో రోహిత్ పేలవమైన ఫామ్ జట్టును కలవరానికి గురి చేస్తోంది. వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా రోహిత్ తన బ్యాటింగ్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించడం లేదు. ప్రతిసారి చెత్త బ్యాటింగ్‌తో నిరాశ ప రుస్తున్నాడు. ఒకప్పుడూ వన్డేల్లో ఎదురులేని బ్యాటర్‌గా ఉన్న రో హిత్ ఇటీవల కాలంలో చాలా మ్యా చుల్లో రెండంకెల స్కోరును సయితం అందుకోలేక పోతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. టెస్టు సిరీస్‌లలో విఫలమైన రోహిత్ తనకు కలిసి వచ్చే వన్డేల్లోనైనా జట్టుకు అండగా నిలుస్తాడని భావిస్తే నిరాశే మిగులుతోంది. ఇప్పటికైనా రోహిత్ తన ఆటను మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించాలి. సాధ్యమైనంత ఎక్కువగా నెట్స్‌లో శ్రమించాల్సి ఉంటుంది.
రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో రోహితే టీమిండియాకు కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అతను ఫామ్ లేమీతో బాధపడుతుండడం జట్టుకు ఇబ్బందిగా మారింది. మిగిలిన రెండు వన్డేల్లోనైనా రోహిత్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ చెలరేగితే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తేలిపోతాయి. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి అతను జట్టుకు శుభారంభం అందించాల్సి ఉంది. రోహిత్ గాడిలో పడితే మిగిలిన రెండు వన్డేల్లో ఇంగ్లండ్ బౌలర్లకు ఇబ్బందులు ఖాయం. అయితే రోహిత్ ఫామ్‌ను అందుకుంటాడా లేక పేలవమైన ఫామ్‌తో మరోసారి తేలిపోతాడ అనేది వేచి చూడాల్సిందే.