భారతదేశానికి మళ్లించిన 104 మంది భారతీయ వలసదారులను అమెరికా సైనిక విమానంలో గొలుసులతో బంధించబడిన పరిస్థితిలో అమృత్‌సర్‌కు చేరుకున్న ఘటన భారతీయుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనకు, ఆందోళనకు దారి తీసింది. వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ భారతీయ హిందూ యువకులు అక్కడ విద్యార్థులుగా, చిన్న చిన్న ఉపాధి అవకాశాల కోసం వెళ్లినవారే. వీరిని నేరస్థుల్లా నిర్బంధించి, అమెరికా సైనిక విమానంలో శృంఖలాలతో పంపడం అమెరికా నిర్దయత, ట్రంప్ నిర్భాగ్య పాలనకు నిదర్శనంగా మారింది. అయితే అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, భారతదేశ పరువు ప్రతిష్ఠ, పరపతి ప్రపంచ వేదికపై తక్కువ చేయబడుతున్నప్పుడు మోడీ ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తుంది? అమెరికాలోని భారతీయ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలు అవమానకరమైనవి. కానీ దీనికి ముందు అమెరికా సంస్థలు ఆ వలసదారుల శ్రమను, నైపుణ్యాన్ని వాడుకున్నాయి.
అమెరికాలో చట్టబద్ధంగా కాకుండా నివసిస్తున్న భారతీయుల సంఖ్య 7.25 లక్షలకు పైగా ఉందని ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. ఈ సంఖ్య మెక్సికన్లు, ఎల్‌సాల్వడోరియన్ల తరువాత మూడోస్థానంలో ఉంది. ట్రంప్ ప్రభుత్వం కఠినమైన వలస విధానాలను అనుసరించి భారతీయులను టార్గెట్ చేయడం మన దేశానికి పెద్ద అవమానం. మన దేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా, మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రఖ్యాతి ఉంది. ఇంతటి దేశానికి చెందిన ప్రజలను శృంఖలాలతో అవమానించి పంపించడం భారత పరపతిని తక్కువ చేయడమే. అంతేకాదు, ప్రధాని మోడీ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడిగా గొప్పలు చెప్పుకుంటారు. పైగా ట్రంప్ విజయం కోసం అమెరికాలో భారతీయ ఓటర్లకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
తన వ్యక్తిగత గొప్ప కోసం ట్రంప్‌ను కౌగలించుకొని మీడియాకు ఫోజులిచ్చారు. పైగా ట్రంప్‌ను ఇండియాకు ఆహ్వానించి భారత్‌లో పేదరికం లేదు అని చాటడానికి మురికివాడలకు పరదాలు అడ్డంగా కట్టించారు. అయినా విదేశీ మీడియా మోడీ అగచాట్లు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మోడీ ఏది ట్రంప్ కంటికి కనిపించకూడదు అనుకున్నారో దానిని తమ కెమెరాలలో బంధించి ప్రపంచానికి చాటింపు వేసింది. మోడీ పిచ్చిగాని భారతదేశ పేదరికం పరదాలు కడితే దాగుతుందా!. ఇప్పుడు భారతీయ వలసదారులపై ట్రంప్ తీసుకున్న దారుణ నిర్ణయంపై మోడీ ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం. భారత దేశంలో ఉపాధి అవకాశాలు లేక యువత విదేశాలకు వలస వెళ్తున్నారు. ఈ సమస్యను స్థానికంగా పరిష్కరించాల్సిన మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశంలో ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. కానీ దీని బదులు మోడీ ప్రభుతం ఆచరణలో కానరాని, ఆడంబర డంబాచారాల ‘మేడ్ ఇన్ ఇండియా’ వంటి మౌఖిక నినాదాలకు, ప్రచారాలకు, ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైంది. ఈ ఘటనలో అత్యధికంగా హిందువులే ఉన్నారని తెలిసిన తర్వాత, మోడీ ప్రభుత్వ ‘హిందుత్వ’ సిద్ధాంతంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. హిందువుల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నట్టు చెప్పుకునే మోడీ ప్రభుత్వం, ఇక్కడ హిందువుల హక్కులను రక్షించలేకపోయింది.
ఈ ప్రభుత్వం నిజంగా హిందువుల కోసం పని చేస్తుందా? లేక అంబానీ, అదానీ వంటి బడా కార్పొరేట్ల కోసం మాత్రమే పనిచేస్తుందా? ఈ ఘటనకు సంబంధించి కొలంబియా ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వానికి తమ భూమిపై ఈ విమానం దిగేందుకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది. కానీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, 1.4 బిలియన్ జనాభా కలిగిన భారత్ మాత్రం మౌనం పాటించింది? మోడీ ప్రభుత్వం ఎందుకు నిర్బంధిత భారతీయులను రక్షించేందుకు అమెరికా ప్రభుత్వాన్ని నిలదీయలేదు? ట్రంప్ ప్రభుత్వం భారతీయులను అవమానిస్తుంటే, మోడీ ప్రభుత్వం వాటిని నిరసించలేకపోతోంది. ఇది ప్రజలకు దేశభక్తి పట్ల నిజమైన అవగాహన కలిగించే అవకాశం. మోడీ హిందుత్వ ప్రభుత్వం కేవలం రాజకీయ లాభం కోసమే హిందువుల్ని ఉపయోగించుకుంటోంది. హిందువుల సంక్షేమం కోసం కాకుండా, కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తోంది. భారత విద్యార్థులను, వలసదారులను ఊహాలోకాలనుంచి వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అమెరికా ప్రభుత్వం భారతీయులను శృంఖలాలతో పంపించిన తీరును ప్రపంచమంతా చూసింది. మోడీ ప్రభుత్వం తన మౌనంతో ఈ అవమానాన్ని అంగీకరించింది.
డా. కోలాహలం రామ్ కిశోర్, 98493 28496