Sunday, February 9, 2025

అబద్ధాలు, మోసపు పాలనకు చరమగీతం: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం శ్లాఘించారు. దేశ రాజధానిలో ఎన్నికల ఫలితాలు అభివృద్ధికి ఆరంభాన్ని ఇస్తాయి అన్నారు. అబద్ధాలు, మోసం, అవినీతి పాలనకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళం పాడాయని అన్నారు. ఇదిలావుండగా 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ బిజెపి అధికారంలోకి రావడంతో కాషాయ పార్టీ క్యాంప్‌లో ఆనందం వెల్లివిరిసింది. బిజెపి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ పాలనను కొనియాడారు. భారత అభివృద్ధికి ఢిల్లీ అభివృద్ధి చాలా అవసరమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధిని కొత్త గరిష్ఠ స్థాయిలకు తీసుకెళ్లగలదని ఆయన తన ‘ఎక్స్’పోస్ట్‌లో పేర్కొన్నారు. చేసిన ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చడానికి, ప్రపంచంలో అగ్ర రాజధానిగా ఢిల్లీని నిలబెట్టడానికి బిజెపి కృతనిశ్చయంతో ఉన్నదని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ తప్పుడు వాగ్దానాలకు, యమునా నది కాలుష్యానికి, మురికి త్రాగు నీరు, రోడ్లు గుంటలుపడిపోవడానికి, ప్రతి వీధిలో మద్యం షాపులు తెరుచుకోవడానికి ఢిల్లీ ఓటర్లు గుణపాఠం చెప్పారని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాగా బిజెపి ఘనవిజయం ప్రజల విజయం అని బిజెపి అధ్యక్షుడు జెపి.నడ్డా అభిప్రాయపడ్డారు. అవినీతి విషయంలో ‘ఆపద’ ప్రభుత్వం అన్ని హద్దులను చెరిపేసిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విజన్ నమ్మిన ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని నడ్డా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News