మేము చెప్పిందే వేదం…?
కమర్షియల్ ట్యాక్స్‌లో ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగుల ఆగ్రహం
తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఉద్యోగుల ఆరోపణ
మనతెలంగాణ/హైదరాబాద్: కమర్షియల్ ట్యాక్స్‌లో పనిచేసే ఆ శాఖ ఉన్నతాధికారులు విచిత్రంగా వ్యవహారిస్తున్నారు. తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తూనే, తమకు నచ్చిన ఉద్యోగులను అందలం ఎక్కించుకుంటూ మేమింతే అన్నట్టుగా వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహారించమంటూనే ఆ శాఖ ఉన్నతాధికారులు నిబంధనలను అతిక్రమిస్తుండడం విశేషం. ఆ శాఖలో పనిచేసే ఉద్యోగి తనకు రావాల్సిన పదోన్నతుల గురించి పోరాడుతుంటే పట్టించుకొని ఆ శాఖ ఉన్నతాధికారులు కనీసం డిపిసిలో పేరు లేని సీనియార్టీలో కూడా పేరు లేని ఒక ఉద్యోగి పదోన్నతి ఇవ్వడంతో పాటు రద్దయిన డిపిసిలో పేరు ఉన్న మరో ఉద్యోగికి పదోన్నతి కల్పించి ఆ శాఖ ఉన్నతాధికారులు ఔరా అనిపించుకున్నారు. ఇలా ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
పదోన్నతుల కోసం సెప్టెంబర్ 01వ తేదీ వరకు ఆగాల్సిందే…
కొన్ని రోజులుగా కమర్షియల్ ట్యాక్స్‌లో పదోన్నతుల కోసం ఆ శాఖకు చెందిన ఉద్యోగులు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి పలుమార్లు విన్నివించారు. అయినా ఆయన స్పందించకపోవడంతో సిఎంఓకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతోపాటు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేయడం, ఆయన వైఖరిని ఎండగడుతూ ఉద్యోగులు నిరసన ప్రదర్శన సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆగ్రహానికి గురైన ఆ శాఖ ఉన్నతాధికారి 2024, ఆగష్టులో జరిగిన డిపిసికి సంబంధించిన పదోన్నతులు ఇవ్వలేదు. దీంతో ఆ డిపిసి డిసెంబర్ 31వ తేదీన రద్దయ్యింది. దీంతో ఉద్యోగులు ప్రస్తుతం పదోన్నతుల కోసం డిపిసి జరగాలంటే ఈ సెప్టెంబర్ 01వ తేదీ వరకు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
డిపిసిలో పేరు లేకున్నా, రద్దయిన డిపిసిలో….
అయితే, ఇదిలా ఉండగా డిసెంబర్ 31వ తేదీన రద్దయిన డిపిసిలోని ఓ ఉద్యోగి జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేయగా ఆయనకు అనూహ్యంగా అదేరోజు (డిసిటిఓ టు సిటిఓ)గా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగితో పాటు మరో ఉద్యోగి కూడా జనవరి 31వ తేదీన పదవీ విరమణ పొందగా ఆ ఉద్యోగి పేరు డిపిసిలో లేకున్నా, కనీసం సీనియార్టీ జాబితాలో లేకున్నా ఆ ఉద్యోగికి కూడా ఆ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలా ఆ రెండు పదోన్నతులు నిబంధనలకు విరుద్ధమని, అర్హత ప్రకారం తమకు రావాల్సిన పదోన్నతులు ఆపిన ఆ శాఖ ఉన్నతాధికారులు ఎలా ఈ రెండు పదోన్నతులు ఇచ్చారో తమకు అర్ధం కావడం లేదని వారు పేర్కొంటున్నారు.
కుటుంబపెద్దలా వ్యవహారించాల్సిన ఈ ఉన్నతాధికారే….
ఇన్ని రోజులుగా పదోన్నతుల కోసం తాము విన్నవించినా పట్టించుకొని ఆ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలా నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించడం వెనుక ఉన్న ఉద్ధేశ్యం ఏమిటనీ వారు ప్రశ్నిస్తున్నారు. రూల్స్‌ను అతిక్రమించమని చెప్పే ఈ ఉన్నతాధికారులే ఇలా నిబంధనలను బేఖాతరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే ఎలా అని, తమకు ఎప్పుడు పదోన్నతులు కల్పిస్తారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆ ఉన్నతాధికారిపై తాము సిఎంఓకు ఫిర్యాదు చేసినా ఆయనలో మార్పు రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇలా అయితే ఈ శాఖలో తాము పనిచేయలేమని, అందరినీ కలుపుకుపోయి కుటుంబపెద్దలా వ్యవహారించాల్సిన ఈ ఉన్నతాధికారే ఇలా చేస్తే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని వారు వాపోతున్నారు.
చాలాచోట్ల ఇన్‌చార్జీ సిటిఓలే…
ఈ ఉన్నతాధికారి వల్లే కమర్షియల్ ట్యాక్స్ (వాణిజ్య పన్నుల శాఖ)లో ఇన్‌చార్జీ సిటిఓల పాలన కొనసాగుతోందని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలో ఇన్‌చార్జీ సిటిఓలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల సిటిఓలు రెండుచోట్ల ఇన్‌చార్జీలుగా వ్యహారించాల్సి రావడంతో వారిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతుండడం ఆ శాఖకు చెడ్డపేరు తీసుకువస్తుందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సంగారెడ్డిలో రెండు సిటిఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆయా స్థానాల్లో ఇన్‌చార్జీ సిటిఓలు బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఇక కామారెడ్డి, నల్లగొండలోని మిర్యాలగూడ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల, సూర్యాపేట, మహబూబ్‌నగర్, గద్వాల్, కోదాడ తదితర ప్రాంతాల్లోనూ ఇన్‌చార్జీ సిటిఓలుగా పలువురు బాధ్యతలు నిర్వహిస్తుండగా, నిజామాబాద్ జేసిగా, కరీంనగర్ జేసిగా కిందిస్థాయి అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నారని, పదోన్నతులు కల్పిస్తే చాలామందికి అవకాశం దక్కుతుందని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు జడ్చర్లలో పనిచేసే ఒక డిసిటిఓకు మూడు బాధ్యతలు అప్పగించడం, ఆ ఉద్యోగిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తుండడం విశేషం.