Sunday, February 9, 2025

లిక్కర్ స్కాం వల్లే ఢిల్లీలో ఆప్ ఓడిపోయింది

- Advertisement -
- Advertisement -

‘మోడీ అంకుల్’ గెలుపులో కవితదే కీలకపాత్ర
దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
తెలంగాణలో బిజెపి ఎదుగుదలకు గులాబీ పార్టీ మూల కారణం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బిఆర్‌ఎస్-, బిజెపి పార్టీల బంధం విడదీయరానిది
బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
లిక్కర్ స్కాంతో కేజ్రీవాల్ ఇమేజ్‌కు తూట్లు
పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

మనతెలంగాణ/హైదరాబాద్: లిక్కర్ స్కాం వల్లే ఢిల్లీలో ఆప్ ఓడిపోయిందని, ‘మోడీ అంకుల్’ గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు కవితను అభినందించాలని కెటిఆర్‌కు దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చురకలంటించారు. బిజెపి గెలుపునకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే అతిపెద్ద కార్యకర్త అంటూ, ఢిల్లీలో బిజెపి గెలిచినందుకు అయనకు అభినందనలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన ట్వీట్‌పై పలువురు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు కెటిఆర్‌పై ఫైర్ అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ కెటిఆర్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం ఆశ్చర్యంగా ఉందని, కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బిజెపి రెండుసార్లు గెలిచిందని, అలాగే మీ సోదరి కవిత నిజామాబాద్‌లో 2019ఎన్నికల్లో ఓడిపోయిందన్న సంగతి మరువరాదని మంత్రి కొండా సురేఖ ఓ ప్రకటనలో ఆరోపించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని, మీరు చేయవలసిన మొదటి పని మీ ‘మోడీ అంకుల్‘ గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు కవితను అభినందించాల్సిందేనని, ఈ ఫలితాన్ని రూపొందించడంలో ఆమె చేసిన ప్రయత్నాలు స్పష్టంగా ఉన్నాయని మంత్రి కొండా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగానికి మించిన వారు ఎవరూ లేరని మోడీకి అర్థమయ్యేలా చేశారని ఆమె తెలిపారు.

వారి నాయకత్వం, మీ కుటుంబానికి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవిని కట్టబెట్టడంలో సహాయపడిందని అయినప్పటికీ, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లతో మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని మంత్రి సురేఖ విమర్శించారు. రాహుల్ గాంధీ బలమైన ప్రభావాన్ని విస్మరించవద్దని ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా వెనుకాడుతోందని ఈ నష్టం బిఆర్‌ఎస్ మరో ఎన్నికల పోరులోకి అడుగు పెట్టడానికి ఇష్టపడకుండా పోయిందని మంత్రి కొండా గుర్తు చేశారు. అందుకే ప్రకటనలు చేస్తున్నప్పుడు, నిజంగా అర్హులను అభినందించడం మర్చిపోవద్దని ‘నెక్ట్ టైమ్ బెటర్ లక్’ కెటిఆర్ అంటూ కొండా సురేఖ సెటైర్ వేశారు.

దేశవ్యాప్తంగా పుంజుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి

కర్ణాటక, తెలంగాణలో ఎలా పుంజుకున్నామో అలాగే దేశవ్యాప్తంగా గెలుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కోసం బిఆర్‌ఎస్ సున్నా సీట్లు తెచ్చుకున్నారన్న విషయం మరిచిపోవద్దని కెటిఆర్ కు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. తెలంగాణలో బిజెపి ఎదుగుదలకు గులాబీ పార్టీ మూల కారణమని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ఓటమి కన్నా బిజెపి గెలుపే కెటిఆర్‌కు సంతోషం: మంత్రి పొన్నం

ఇక కెటిఆర్ ట్వీట్ పై మరో బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బిజెపి గెలుపు కెటిఆర్‌కు చాలా ఆనందాన్ని ఇస్తోందన్నారు. కేసుల మాఫీ కోసమే ఇదంతా చేస్తున్నారన్నది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని ఏలుతామని పార్టీ పేరు మార్చుకున్న మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ఆయన మండిపడ్డారు. బిఆర్‌ఎస్-, బిజెపి పార్టీల బంధం విడదీయరానిదని, అది నిజమని మరోసారి కెటిఆర్ నిరూపించారని పొన్నం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఢిల్లీలో ఆప్ పతనానికి లిక్కర్ స్కాం పునాది: పిసిసి అధ్యక్షుడు

ఢిల్లీలో ఆప్ ఓటమికి రెండు కారణాలని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా వచ్చిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఆప్‌ను కోలుకోలేకుండా దెబ్బ తీశాయని ఆయన అన్నారు. ఈ పరిస్థితికి కేజ్రీవాల్ స్వయంకృతాపరాధమే కారణమని ఆయన అన్నారు. కెసిఆర్ సారథ్యంలోని బిఆర్‌ఎస్ పార్టీతో కేజ్రీవాల్ స్నేహం ఆయన కొంప ముంచిందని ఆయన ఆరోపించారు. కెసిఆర్ కుమార్తె కవితతో కేజ్రీ అండ్ కో లిక్కర్ వ్యాపారం ఆరోపణలు ఆయన పతనానికి పునాదులు వేశాయన్నారు.

ఏ అవినీతిరహిత నినాదంతో కేజ్రీవాల్ దేశ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారో దానికి తూట్లు పొడిచింది లిక్కర్ స్కాం అని ఆయన ఆరోపించారు. ఆప్‌కు ఇప్పటివరకు ఉన్న క్లీన్ ఇమేజ్ ను లిక్కర్ స్కాం ఆరోపణలు ఊడ్చిపారేశాయన్నారు. అవినీతికి కేజ్రీవాల్ అతీతుడు కాదన్న అభిప్రాయం ప్రజల్లో కలగడానికి కెసిఆర్ ఫ్యామిలీ కారణమయ్యిందన్నారు. రెండు దఫాలు ఢిల్లీని ఏలిన కేజ్రీ పాలనలో లిక్కర్ స్కాం తప్ప మరో అవినీతి ఆరోపణ లేదన్నారు. కవిత లిక్కర్ వ్యాపార కాంక్ష కేజ్రీ పార్టీ సిద్ధాంతానికే తూట్లు పొడిచిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News