‘వేవ్స్ 2025’లో తనను భాగం చేసినందుకు..
ప్రధాని మోదీకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా కృతజ్ఞతలు
మన తెలంగాణ/హైదరాబాద్: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)లో తనను కూడా భాగం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అడ్వైజరీ బోర్డులో భాగం కావడం ఆనందంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు చిరంజీవి తన ’ఎక్స్’ వేదికగా ఓ స్పెషల్ పోస్టు పెట్టారు. తనకు దక్కిన అరుదైన గౌరవానికి ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
“గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ గౌరవానికి ధన్యవాదాలు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డులో భాగం కావడం, ఇతర సభ్యులతో కలిసి నా అభిప్రాయాలను పంచుకోవడం నిజంగా ఒక అదృష్టం. ప్రధాని మోడీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వేవ్స్ ఇండియా తాలూకు ’సాఫ్ట్ పవర్’ను ప్రపంచానికి అర్థం అయ్యేలా చేస్తుంది’ అని చిరంజీవి ఆ ట్వీట్ పేర్కొన్నారు.
భారత్‌లో తొలిసారి ‘వేవ్స్ సమ్మిట్ 2025’
వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025ను తొలిసారిగా భారత్‌లో ఈ ఏడాది చివరలో నిర్వహించాలని కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన వేవ్స్‌పై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 7 శుక్రవారం నాడు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ వారి సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ అమీర్‌ఖాన్, స్టార్ హీరో అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, అలనాటి నటి హేమమాలిని, హీరోయిన్ దీపిక పదుకొనే, ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా తదితరులు పాల్గొన్నారు. ఇంకా పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపారవేత్తలు సైతం పాల్గొన్నారు. సమ్మిట్ కోసం వీరందరి సలహాలు, సూచనలు ఈ సందర్భంగా ప్రధాని తీసుకున్నారు.