రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ముస్లిం బిసి అనే పదాన్ని రిజర్వేషన్ల కేటగిరి నుంచి తొలగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి బీసీలను అవమానిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బుజ్జగింపు రాజకీయలకు పాల్పడుతుంది.
బిసిల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యం, కీలక నేతలతో భేటీలో కిషన్‌రెడ్డి దిశానిర్దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ముస్లిం బిసి అనే పదాన్ని రిజర్వేషన్ల కేటగిరి నుంచి తొలగిస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. బీసీలను అవమానిస్తూ గతం నుంచీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై హైదరాబాద్ గోల్కొండ హోటల్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అభ్యర్థులు, కీలక నేతలతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్, బిజెపి జాతీ య ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపి డీకే అరు ణ, ఎంపి రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ఎన్నికల అభ్యర్థులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయండ లేదని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగులు, నిరుద్యోగుల పట్ల వివక్ష, నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేసి బుజ్జగింపు రాజకీయలకు పాల్పడుతోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణపై వివరిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల పక్షాన ఎండగట్టాలని కాంగ్రెస్ సర్కారు మోసాలను ప్రజలకు వివరించేలా ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించారు.
బీసీల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత
కులగణనతో దేశానికే తెలంగాణ ఆదర్శింగా నిలిచిందని రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో పదే పదే చెబుతున్నారని వివరించారు. కానీ హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని విడగొట్టడమే మీ ఆదర్శమా అని కిషన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. అసలు హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని రాజ్యంగంలో ఎక్కడ ఉందో చెప్పాలని నిలదీశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్యాయం చేశారని గుర్తు చేశారు.