భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. 2015లో 3 సీట్లు, 2020లో 8 సీట్లు సాధించి, కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఆ పార్టీ నేడు అప్రతిహతమైన విజయంతో ఢిల్లీ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించబోతున్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6.6 % ఓట్లతో కనీసం ఖాతా కూడా తెరవకుండా ఘోర వైఫల్యం చెందడం ‘ఇండియా’ కూటమి అనైక్యతకు పరాకాష్ఠ. ఆమ్‌ఆద్మీ పార్టీ వలన పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ దెబ్బతిన్న మాట సత్యదూరం కాదు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు చీల్చడంలో ఆప్ ప్రధానపాత్ర పోషించింది. ఇప్పుడు ఆప్ స్వీయ తప్పిదాలతో కాంగ్రెస్‌ను, ‘ఇండియా’ కూటమిని కాదనుకుని ఢిల్లీ పీఠాన్ని బిజెపికు ధారాదత్తం చేసింది.
కేజ్రీవాల్ ఏకపక్ష ధోరణి ప్రతిపక్షాల ఐక్యతా రాగంలో అపశ్రుతులను పలికించింది. రాజకీయమనే పరమపద సోపాన పటంలో విజేతలెవరో, పరాజితులెవరో తేల్చేది ఓటర్లే అయినా రాజకీయ వ్యూహాలు, అవకాశవాదం, తిమ్మినిబమ్మిని చేయగల నేర్పరితనం, ప్రజలను తికమకపెట్టే ప్రచారం, సోషల్ మీడియా ప్రభావం వర్తమాన రాజకీయాలను శాసిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ఇందుకు విరుద్ధంగా లేవన్న నిజం గ్రహించాలి. మెజారిటీ సర్వేలు బిజెపికు అనుకూలంగానే ఫలితాలొస్తాయని ప్రకటించాయి. పలువురు రాజకీయ విశ్లేషకులూ ఈ పర్యాయం ఢిల్లీ పీఠం బిజెపికే దక్కుతుందని స్పష్టం చేయడం జరిగింది. ఊహించిన విధంగానే సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో బిజెపి విజయకేతనం ఎగరేసింది. ఢిల్లీ రాజకీయ ముఖచిత్రంలో కాషాయ వర్ణం దేదీప్యమానంగా వెలుగొందింది. పోస్టల్ బ్యాలెట్‌లో కూడా బిజెపి ఆధిక్యత ప్రదర్శించడం ఉద్యోగస్థుల్లో ఆప్ పట్ల పెరిగిన వ్యతిరేకతకు నిదర్శనం.
70 స్థానాలు గల ఢిల్లీ శాసనసభలో 2015లో 67 సీట్లతో, 2020 లో 62 సీట్లతో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, ప్రత్యక్షంగా మోడీతో తలపడుతూ, రాజకీయ యుద్ధంలో పోరాడారు. లిక్కర్ కుంభకోణంలో అరెస్టయి, తీహార్ జైలు కెళ్ళిన కేజ్రీవాల్ జైలునుంచే పరిపాలన సాగించి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆతిశీకు ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు. ఎన్నికల్లో విజయం సాధించి, తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలన్న కేజ్రీవాల్ ఆశలు అడియాసలైనాయి. మోడీ, కేజ్రీవాల్ మధ్య జరిగిన ఎన్నికల యుద్ధంలో కేజ్రీవాల్‌ను ఓడి గెలిచిన రాజకీయ యోధుడిగానే పరిగణించాలి. అయినా ఈ వైఫల్యంలో కేజ్రీవాల్‌కు సింహభాగముందనే చెప్పాలి.
కేవలం 100 కోట్ల అవినీతి పెద్ద విషయంకాదని ప్రజలు అనుకోలేదు. 2013 సంవత్సరంలో కేవలం 28 సీట్లు గెలుపొంది, కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే కాంగ్రెస్‌తో విభేదించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 2015, 2020 సంవత్సరాల్లో ఆప్ ఘన విజయంతో ఢిల్లీ ముఖ్య మంత్రిగా మరలా బాధ్యతలు చేపట్టి, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆప్ ను విస్తరించడానికి కృషి చేశారు. ప్రధాని మోడీతో రాజకీయంగా తలపడి ప్రస్తుత ఎన్నికల్లో ఆప్‌ను అపజయ తీరానికి చేర్చారు. ఈ ఎన్నికల్లో సానుభూతితో గెలిచి నాలుగోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ఆప్ ఆశలు ఫలించలేదు. బిజెపి 48 శాతం ఓట్లతో, ఆప్ 43 శాతం ఓట్లతో హోరాహోరీగా తలపడ్డాయి.
ఆప్ అమలు చేసిన ఉచిత పథకాలకు దీటుగా బిజెపి కూడా ఎడాపెడా ఢిల్లీ ప్రజలకు వాగ్దానాలు చేసింది. కాషాయ పార్టీ కలల సాకారంలో ఫ్రీ బీస్ కూడా ప్రధాన పాత్ర వహించి ఉండవచ్చు. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలు పోటీ చేసిన స్థానాల్లో ఓటమి చెందడం ఆప్ పట్ల ఢిల్లీ ప్రజలకున్న ఆగ్రహాన్ని సూచిస్తున్నది. ఏదిఏమైనప్పటికీ ఎవరు గెలిచినా, ఢిల్లీని ప్రశాంతంగా, రాజకీయ గందరగోళం లేకుండా పాలించాలి. సుపరిపాలనతో ఢిల్లీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలి. కాలుష్యంతో కకావికలమవుతున్న హస్తిన ప్రజలను కాపాడాలి. ఢిల్లీ కాలుష్యానికి కారణభూతమవుతున్న వ్యవసాయ వ్యర్ధాల విషయంలో తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఢిల్లీని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలి. ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలి.
సుంకవల్లి సత్తిరాజు
97049 03463