ప్రయాగ్‌రాజ్: వేలాది మంది భక్తులు హైవే గుండా మహాకుంభమేళాకు వెళుతుండడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అయిపోయింది. వందలాది కిలోమీటర్ల దూరం మేరకు ట్రాఫిక్ జామ్ కావడం ఆశ్చర్యం కొలిపే విషయం. అందిన సమాచారం ప్రకారం దాదాపు 300 కిమీ. మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. ‘నేడు ప్రయాగ్‌రాజ్ వైపు వెళ్లడం అసాధ్యం, ఎందుకంటే 200 నుంచి 300 కిమీ. మేరకు ట్రాఫిక్ జామ్ అయింది’ అని పోలీసులు తెలిపారు. వీకెండ్ రష్ కారణంగా ట్రాఫిక్ జామ్ అయిందని రేవా జోన్ ఐజిపి సాకేత్ ప్రకాశ్ పాండే తెలిపారు. మరికొన్ని రోజుల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘రెండు రోజులుగా వాహనాలు రద్దీలో ఇరుక్కుపోయాయి.
50 కిమీ. దూరం కవర్ చేయడానికి దాదాపు 10 నుంచి 12 గంటలు పడుతోంది’ అని ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి తెలిపాడు. వారణాసి, లక్నో, కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రూట్లలో దాదాపు 25 కిమీ. మేరకు ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. ఇక మహాకుంభ్‌నగర్‌లో కూడా ట్రాఫిక్ జామ్ కనీసం 7 కిమీ. మేరకు ఉంది. ప్రయాగ్‌రాజ్ సంగం స్టేషన్ నుంచి బయటపడ్డానికి కూడా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని రైల్వే అధికారి కుల్దీప్ తివారీ తెలిపారు. ఇదిలావుండగా ప్రయాగ్‌రాజ్‌లో ట్రాఫిక్ రద్దీపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.