రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ జరిగిన దాడి అమానుషమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఉన్న కిషన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్‌పై దాడి అత్యంత బాధాకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు. గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ఇటువంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదని తెలిపారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న రంగరాజన్ దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే అంశంలో ముందువరసలో ఉన్నారని కొనియాడారు. సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి తరఫున రంగరాజన్‌కు అన్నిరకాలుగా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.
రంగరాజన్‌కు బండి సంజయ్ ఫోన్‌లో పరామర్శ
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనను కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించి, అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు సోమవారం బండి సంజయ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దాడి జరిగిన తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులు ఎంతటి వారైనా సరే శిక్షించాలని డిమాండ్ చేశారు.