కెసిఆర్ పాలన ఐఫోన్‌లా ఉంటే… రేవంత్‌రెడ్డి పాలన చైనా ఫోన్‌లా ఉందని, ఐఫోన్‌కు, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉంటదో కెసిఆర్‌కు, రేవంత్‌రెడ్డికి అంత తేడా ఉందని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మాయమాటలు చెప్పి బిసిల ఓట్లు వేయించుకున్న సిఎం రేవంత్‌రెడ్డి బిసి కులగణనలో తప్పుడు లెక్కలు చూపించి బురిడీ కొట్టించారన్నారు. తప్పుడు జనాభా లెక్కలు చూపడంతో కాంగ్రెస్ పట్ల బిసి సమాజం అట్టుడికిపోతోందని అన్నారు. సిఎం వెంటనే బిసి కుల సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. 2014లోనే రాష్ట్రంలో బిసిల జనాభా 52 శాతం ఉందని కెసిఆర్ చేపట్టిన సర్వేలో తేలిందని, లెక్కపెట్టడం కూడా చేతగాని రేవంత్‌రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చూపి బిసిలను మోసం చేయడం శోచనీయమన్నారు.
ఈ తప్పుడు లెక్కలను రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో వినిపించి పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అసెంబ్లీలో బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారనే లెక్కలను ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బిసి సంఘాలతో సమావేశం పెట్టారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఢిల్లీకి 31సార్లు వెళ్లేందుకు సమయం దొరుకుతుంది కానీ బిసి సంఘాలతో సమావేశమయ్యేందుకు సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. కనీసం బిసి ఉద్యమాలు చేస్తున్న ముఖ్య నాయకులతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బిసిలను అవమానించడమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని అన్నారు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బిసిలంతా సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచించిందని మండిపడ్డారు. సాగు నీరందక ఎండిపోయిన పంట పొలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారని, ఎండిన పంటలను చూస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు. కెసిఆర్‌పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెఉ్టను వినియోగించడం లేదని, కనీసం రైతులకు సాగు నీరిచ్చే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద కాల్వకు నీరందించి జలధారగా మార్చితే ఈ ప్రభుత్వం ఎండబెట్టిందన్నారు. రాజకీయ కక్షను పక్కనబెట్టి కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని రేవంత్‌రెడ్డికి సూచించారు. రేవంత్‌రెడ్డి సర్కారు తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారని, నూరు తప్పులు చేసిన శిశుపాలుడికి ఏ పరిస్థితి వచ్చిందో… సిఎంకి కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. రేషన్ కార్డులు ఇస్తామని.. అవి ఇవ్వడం లేదని, రుణమాఫీ, రైతు భరోసా ఎక్కడా సంపూర్ణంగా అమలు కాకపోవడంతో రైతులంతా కాంగ్రెస్‌పై మండిపడుతున్నారని పేర్కొన్నారు.
తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన చందంగా జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్‌కుమర్ బిఆర్‌ఎస్‌కు ద్రోహం చసి కాంగ్రెస్‌లో చేరారని, ఆయన ఒక్కడు పోయినంత మాత్రాన బిఆర్‌ఎస్‌కు నష్టమేమీ లేదన్నారు. ఎంఎల్‌ఎ పోయినా పార్టీ నాయకులు, కార్యకర్తల మనోధైర్యం ఎక్కడా చెక్కుచెదరలేదని, ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి ఎల్.రమణ, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, నాయకులు లోక బాపురెడ్డి, ఓరుగంటి రమణారావు, దావ వసంత, గట్టు సతీశ్ తదితరులు పాల్గొన్నారు.