కొడంగల్‌లో సంవత్సరం నుండి కురుక్షేత్ర యుద్ధం నడుస్తోంది
అన్నదమ్ముల కోసం.. అదానీ కోసం పనిచేస్తున్న రేవంత్
దమ్ముంటే సిఎం పదవికి రాజీనామా చెయ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కెటిఆర్ సవాల్
కోస్గి బిఆర్‌ఎస్ రైతు దీక్షలో ఘాటు వ్యాఖ్యలు
లగచర్ల లడాయిలో పాల్గొన్న మహిళ కూతురికి భూమి అనే నామకరణం చేసిన కెటిఆర్
కొడంగల్‌లో ఉప ఎన్నిక వస్తే రూ.50 వేల మెజార్జీతో పట్నం నరేందర్ రెడ్డి గెలుస్తారని జోస్యం
రాబోవు ఎన్నికల్లో వడ్డీతో సహా చెల్లించిస్తామని ధీమా
గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో దుర్యోధనుడి పరిపాలన కొనసాగుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘాటుగా మండిపడ్డారు. నారాయణపేట జిల్లా, కోస్గీలో సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు దీక్షలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్‌లో సంవత్సరం నుండి కురుక్షేత్ర యుద్ధం నడుస్తోందని అన్నరు. ఎన్నో ఆశలతో జనం ఓట్లు వేసి గెలిపించుకుంటే 14 నెలలుగా ఏనుముల అన్నదమ్ముల కోసం.. అదానీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ భూములను తొండలు గుడ్లు కూడా పెట్టని భూములు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని, అయితే, తాను వచ్చే దారిలో లగచర్ల పరిధి ప్రారంభం అని ఉంటే తాను కూడా వెళ్లి చూస్తే అక్కడ పచ్చని వరి పంటలు ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రిగా ఉండి కూడా రేవంత్ అబద్ధం చెబుతున్నారని మండిపడ్డారు. మొన్న కోస్గిలో సభ మీటింగ్ పెట్టి రైతులకు టకీ … టకీమని పైసలు పడతాయని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ ఎవరికీ రాలేదన్నారు. లగచర్ల గ్రామ భూములను అల్లుడు ఫార్మా కంపెనీ కోసం గుంజుకోవాలని చూస్తున్నారని అన్నారు. 14 నెలలుగా ఎన్నో అరాచకాలు చేస్తున్నారని, కొడంగల్ రైతుల కోసం తాను సంవత్సమైనా జైల్లో ఉంటానని, తమ ప్రాంత రైతులను జైల్లో పెట్టారని, వాళ్లను విడిపించాలని మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డి తనతో చెప్పారని అన్నారు. 9 నెలలు గర్భవతిగా ఉన్న జ్యోతి తమతో పాటు ఢిల్లీకి వచ్చిందన్నారు. అక్కడికి వచ్చి రైతులంతా హ్యూమన్‌రైట్స్ ముందు తమ బాధను వినిపించుకున్నారని అన్నారు. తాను వస్తుంటే టెంట్ కింద ఆనాడు గర్భిణిగా ఉన్న జ్యోతి బిడ్డకు జన్మనిచ్చిందని, తన బిడ్డకు పేరు పెట్టు అనడంతో వాళ్ల ఇంటి పేరుతో కలిపి ‘భూమి’ అనే పేరు పెట్టానని అన్నారు.
భూ పోరాటంలో బిడ్డకు పేరు పెట్టడం తనకు చాలా సంతోషంగా అనిపించిందన్నారు. తొందర్లోనే రేవంత్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి అచ్చంపేటకు పంపుతామన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని సవాల్ చేశారు. తాము ఎవరం కూడా ప్రచారానికి రామని, పట్నం నరేందర్ రెడ్డికి 50 వేల ఓట్ల మెజార్టీ తగ్గితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానిని అన్నారు. ఇక్కడికి వస్తుంటే నాయీబ్రాహ్మణ, రజక సోదరులు వచ్చి తనను కలిసి మొరపెట్టుకున్నారని అన్నారు. కేసిఆర్ ఉన్నపుడు తమకు ఉచిత కరెంటు ఇస్తుండేనని, ఇప్పుడు మళ్లీ బిల్లులు ఇస్తున్నారని తెలిపారని అన్నారు. ‘రేవంత్ రెడ్డి ..నీకు చిత్తశుద్ధ్ది ఉంటే కల్వకుర్తిలోని భూములలో ఫార్మా కంపెనీ పెట్టు’ అని సవాల్ చేశారు. ‘అల్లుడి కోసం…అదానీ కోసం భూములు తీసుకుంటాం అంటే నీ అయ్య జాగీరు కాదు రేవంత్ రెడ్డి..బరాబర్ అడుగుతాం..కడుగుతాం’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, లకా్ష్మరెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, హుజూరాబాద్ ఎంఎల్‌ఎ పాడి కౌశిత్ రెడ్డి, ఎంఎల్‌సి నవీన్ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు రాజేందర్ రెడ్డి, రాంమోహన్ రెడి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహేష్ రెడ్డి, ఆనంద్, ఆంజయ్య, ప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, రామకృష్ణ, సలీం, వెంకట్ నర్సిములతో పాటు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.