ఆంగ్ల తత్వవేత్త జెరెమీ బెంథమ్ ప్రతిపాదిత ఉపయోగితావాద సిద్ధాంతమైన ‘గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ది గ్రేటెస్ట్ నంబర్’ను (అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక మంచి చేకూరడం) పలువురు రాజకీయ, సామాజిక, పాలనారంగ ప్రముఖులు ఆమోదించారు. ఇది ప్రభుత్వాల పనితీరును లక్ష్యంగా పెట్టుకుని ఆలోచన చేయబడిన అద్భుతమైన సందేశం. ప్రభుత్వాల ఆలోచనారహిత, ఏకపక్ష విధి-విధాన నిర్ణయాల మంచిచెడులు, లాభనష్టాలు భేరీజు వేయడం జరుగుతున్నదా, లేదా? అవి అత్యధిక సంఖ్యాకులకు మేలు చేకూరుస్తున్నాయా? కీడు కలిగిస్తున్నాయా? అనే ‘మెరిట్, డీ మెరిట్’ మీదనే వాటి మనుగడ సాధ్యం అనే సిద్ధ్దాంతానికి ప్రాతిపదిక బెంథమ్ ఆలోచన. దీన్నే జాన్ స్టువర్ట్ మిల్ ‘గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ప్రిన్సిపల్’ (అత్యధికులకు ఆనందం అనే సిద్ధాంతం) రూపంలో మరింత ముందుకు తీసుకుపోయారు.
భారతదేశంలో కాలానుగుణంగా మారుతున్న న్యాయ వ్యవస్థ అవసరాలను గుర్తించి, బహుశా విప్లవాత్మకంగా న్యాయ సంహితను పునర్నిర్మించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించి, న్యాయ సంఘం, నిపుణులు, లాయర్లు, న్యాయమూర్తులు, పార్లమెంటరీ కమిటీలు విశ్లేషణ జరిపి కొత్త నిబంధనలను రూపొందించడం జరిగింది. మార్పులో భాగంగా ‘భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)’ అనే కొత్త క్రిమినల్ కోడ్ చట్టాలను తీసుకురావడంతో, ఇవి, బెంథమ్, జాన్ స్టువర్ట్ మిల్‌ల సిద్ధాంతాలకు అన్వయించి, విశ్లేషించాల్సిన అవసరం వున్నదనాలి. 2024 జులై 1న ఈ చట్టం అమల్లోకి రావడంతో బ్రిటీష్ భారత కాలంనాటి ‘ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)’ స్థానాన్ని భర్తీ చేసింది. బిఎన్‌ఎస్‌లో ఉపయోగించిన భాష, భారతీయ వ్యవహార శైలిలో ‘సంస్కృత పదజాలం, నిర్వచనాలు’ కలిగి వున్నాయనాలి. ఉదాహరణకు రాష్ట్ర ద్రోహ్, అసమయిక సభ, హత్య, చోరీ, ధార్మిక భావన భంగం, బలాత్కారం, సైబర్ అపరాధం, అపవాదు మొదలైనవి వున్నాయి. క్రిమినల్ చట్టాల్లో ఉపయోగించే భాషను నవీకరించి, సైబర్ నేరాలను, వ్యవస్థీకృత నేరాలను, ఆర్ధిక మోసాలను, తదితర వర్తమాన నేరాలకు సంబంధించిన నిబంధనలనుపరిచయం చేస్తుంది చట్టం. పిల్లల, మహిళలపట్ల జరుగుతున్న నేరాలకు, బలాత్కారం, లైంగిక వేధింపులకు, మెరుగైన, కఠినమైన జరిమానాలను, ‘మరింత కఠినమైన శిక్షలను’ అమలు పరచడానికి నిబంధనలను పొందుపరచడం జరిగింది. చట్టాలలో తీసుకువచ్చిన ఈ మార్పులకు అనుకూలతతో పాటు, తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది.
ఈ నవీన నామకరణ చట్టాలు కేంద్రప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసి నొక్కి వక్కాణించినట్లుగా ‘న్యాయ ప్రక్రియలో ఆలస్యాలు’ తగ్గిస్తాయా? ‘న్యాయ ప్రక్రియను’ సులభతరం చేస్తాయా? అనేది ఆలోచన జరగాలి. న్యాయస్థానాల రికార్డులను డిజిటలైజ్ చేయడం, ఈ-ఫైలింగ్‌ను ప్రోత్సహించడం, వర్చువల్ హియరింగ్స్‌ను ముమ్మరం చేయడం కొత్త చట్టాలలో భాగం. ఈ ప్రయత్నాలు కేసుల పరిష్కారాలను వేగవంతం చేసి, పెండింగ్ కేసుల వ్యవధిని తగ్గించడానికి వీలవుతుందా? తేలాలి. చట్టాలలో పొందుపర్చిన ‘బాధితుల హక్కుల’ పట్ల మరింత దృష్టి సారించడం, నేర న్యాయ ప్రక్రియలో వారి భాగస్వామ్యం కలిగించడం, బాధితులకు చట్టపరంగా అవసరమైన నష్టపరిహారం చెల్లించడం, సాక్షుల రక్షణ కార్యక్రమం, నేరాల బాధితులకు సరైన సమయంలో, శారీరక ఆరోగ్య -వైద్య పరీక్షలు చేయించే విధానం చేసే మేలు తెలియాలి. హేయమైన నేరాలకు కఠినమైన జరిమానాలను విధించడం, శిక్షలు, బలాత్కారం, యాసిడ్ దాడులు, మానవ అక్రమ రవాణా లాంటి నేరాలకు మరింత కఠినమైన శిక్షలను అమలుపరచడం, ఈ నేరాల పట్ల జీరో -టాలరెన్స్ విధానాన్ని అవలంభించడం నూతన చట్టాల ప్రాముఖ్యత అని ప్రభుత్వం అంటున్నది.
న్యాయవ్యవస్థపై భారం తగ్గించడానికి, చిన్న, చిన్న నేరాలను, నేర రహితమైనవిగా, పౌర ఉల్లంఘనలుగా వర్గీకరించడం, తద్వారా తీవ్రమైన నేరాలపై దృష్టిని కేంద్రీకరించడం, వనరులను ఆ దిశగా వినియోగించడం జరిగిందని ప్రభుత్వ వాదన. ఇవన్నీ చేయ డం ద్వారా, కొత్త చట్టాల లక్ష్యం, సమాజంలో నేరస్థుల పునరావాసం, పునఃసంప్రేక్షణకు ప్రోత్సాహించడం, నేరస్థులను తిరిగి సమాజంలోకి చేర్చడం, క్షమాభిక్ష ప్రసాదించడం, కౌన్సిలింగ్ ద్వారా చిన్న నేరాలకు పాల్పడినవారికి జైలు శిక్షలకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది న్యాయవ్యవస్థ పునరావాస దృక్పథాన్ని, సంస్కరణ కోణాన్ని ప్రస్ఫుటంగా సూచిస్తుందని కొందరి భావన. ఇవన్నీ పారదర్శకంగా జరిగితే మంచిదే. ఈ చట్టాలను లోతుగా, నిష్పాక్షికంగా విశ్లేషిస్తే ప్రభుత్వం ఇస్తున్న వివరణలన్నీ సానుకూల వాదనలే అయినప్పటికీ, వాటిలో నిభిడీకృతమై వున్న చట్టపరమైన లాభనష్టాలను, ప్రయోజనాలను, అప్రయోజనాలను, ప్రభుత్వం మరికొంత జాగరూకతతో, పరిశీలనాత్మక దృక్పథంతో, సామాన్యుల అవగాహనా కోణంలో, మెరుగైన, తెలివైన నిర్ణయం తీసుకుని, అవసరమైన, ఆధారిత మార్పులను కాలానుగుణంగా చేయాలి. కొత్త చట్టాల ‘ఆవశ్యకతలు, అనివార్యతలు, చిక్కులు, ప్రభావాలు, అమలు’ పరిచే సరైన వ్యూహం, చట్టపరమైన నిపుణల, సద్విమర్శించగల ప్రతిపక్ష నాయకుల, సామాన్య వ్యక్తుల ఆమోదయోగ్యమైనవిగా వుండేలా ప్రభుత్వం జాగ్రత్త పడాలి.
అలా జరిగినప్పుడే జెరెమీ బెంథమ్ ప్రతిపాదించిన ‘అత్యధిక సంఖ్యాకులకు అత్యధిక మంచి చేకూరడం’ సిద్దాంతం కానీ, జాన్ స్టువర్ట్ మిల్ ప్రతిపాదించిన ‘అత్యధిక సంఖ్యాక ప్రజలకు అత్యధిక లబ్ధి’ అనే సిద్ధాంతం కానీ పాటించినట్లు అవుతుంది. నవీన చట్టాలు నేరాలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి సాంకేతికతకను విరివిగా వినియోగిస్తాయి. నిష్పక్షపాత విశ్లేషణ ఎప్పటికప్పుడు జరిగితే న్యాయపరిజ్ఞానం ఉన్నవారికి, సామాన్య వ్యక్తికి కొత్త చట్టాలను, వాటిలో వున్న బలాలను, బలహీనతలను, అవకాశాలను, ఇబ్బందులను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి సహాయపడవచ్చు. కొందరు న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రధానంగా చట్టాల ఆధునీకరణ, సమర్థత (సాంకేతిక, సులభతరమైన విధానాల సమీకరణ), నేరస్థుల కేంద్రీకృత సహాయతా దృక్పథం (దయ, వేగవంతమైన న్యాయప్రక్రియ), కఠినమైన శిక్షలు (తీవ్రమైన నేరాలకు మాత్రమే) మొదలైనవి చట్టంలో వున్నాయి.
చట్టంలో బలహీనతల గురించి ప్రస్తావించాలంటే, అమలు పరచే ప్రక్రియలో సవాళ్లు (పాత నుండి కొత్త చట్టాలకు మార్పు), సాంకేతికత మీద ప్రధానంగా ఆధారపడటం (ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ మౌలిక సదుపాయాల లభ్యత పరిమితంగా ఉండటం), అపనమ్మకం (కఠినమైన చట్టాల, శిక్షల దుర్వినియోగం, అపనమ్మకం) మొదలైనవి వున్నాయి. ఈ చట్టం అమలు ద్వారా భవిష్యత్తులో అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయంటున్నారు న్యాయనిపుణులు. న్యాయ సంస్కరణలు (న్యాయ వ్యవస్థను మరింత బలపరచడం), ప్రజావిశ్వాసం పెంచడం (ఆధునిక పద్ధతులు ప్రజా విశ్వాసం పునరుద్ధరించడానికి సామర్థ్యం కలిగి ఉంటాయి), అంతర్జాతీయ సరళి (అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలకు అనుగుణంగా మారడం) మొదలైనవి ఇందులో భాగంగా చెప్పుకోవాలి. చట్టం అమల్లో ఇబ్బందులు లేకపోలేదు, సహజంగానే మార్పును నిరాకరించడం (వాటాదారులు, న్యాయనిపుణుల ప్రతిఘటనకు అవకాశాలు), సైబర్ సెక్యూరిటీ ప్రమాదం (సాంకేతికత మీద ఆధారపడటం వల్ల సున్నితమైన ఆధార్ లాంటి న్యాయ డేటా, ఇతర ప్రక్రియలకు ముప్పు), ఆర్థిక భారం (మార్పులను అమలు చేయడం కోసం భారీ మొత్తంలో నిధుల అవసరం) మొదలైనవి, ఇందులో భాగంగా అర్థం చేసుకోవాలి.
భారతీయ న్యాయ సంహిత, వేదకాలం నుండి పాటించిన సహజ న్యాయ సూత్రాల, తత్వవేత్తల, వేదాల, మనుస్మృతి, మహాభారతం, రామాయణం, కౌటిల్యుడి అర్థశాస్త్రం మొదలైన వాటిలో ప్రస్తుతించిన వాటికి అనుగుణంగా వుండకపోతే సార్వజనీక ఆమోదం ఒకింత అనుమానాస్పదమే! ‘సత్యం, నైతిక క్రమం’ ప్రాముఖ్యతను పెంపొందించే, నొక్కి వక్కాణించే వేదాలు, న్యాయసూత్రాలు, ‘హిందూ వేదాంత తత్త్వానికి’ ప్రధాన భావనైన ‘నైతికత, నైతిక సూత్రాలు’ అనే మానవ ప్రవర్తనను మార్గనిర్దేశం చేస్తాయి. ఇందులో విధులు, హక్కులు, చట్టాలు, ప్రవర్తన, సద్గుణాలు, జీవన విధానం చేర్చబడింది. ‘భారతీయ న్యాయ సంహిత’ ఈ ‘సహజ న్యాయ సూత్రాలను’ వాస్తవ దృక్ఫధంతో సమర్థవంతంగా, సమన్యాయంతో న్యాయవ్యవస్థ సమకూర్చాల్సిన హక్కుల పరిరక్షణను పాటిస్తూ, ఆధునిక అవసరాలను తీర్చే దిశగా సముచితంగా అడుగులు వేస్తుందా, లేదా, అనేది కోటి రూకల ప్రశ్న.’ వేచి చూస్తేనే అవగతమవుతుంది!
వనం జ్వాలా నరసింహారావు