Wednesday, February 12, 2025

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి:హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం, కొనాయిపల్లిలో మంగళవారం శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తమ హయాంలో జిల్లాలో 75 కోట్లతో అనేక దేవాలయాలను అభివృద్ధి చేశామని అన్నారు. కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మాజీ సిఎం కెసిఆర్ ఏ ముఖ్య కార్యక్రమం అయినా ఈ దేవాలయం నుండి ప్రారంభిస్తారని తెలిపారు.

రూ.3 కోట్ల 60 లక్షలతో దేవాలయాన్ని కెసిఆర్ అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చే విధంగా చూడాలని వేంకటేశ్వరస్వామిని కోరానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 15 నెలలుగా దేవాలయాలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. కొత్తగా ఒక్క దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయలేదని, గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను కూడా నిలిపివేశారని మండిపడ్డారు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టుకల్లా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన సిఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశారన్నారు. జనవరి 26కి రైతు భరోసా అందరు రైతులకు ఇస్తామని ఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు. వానకాలం రైతుబంధు ఎగబెట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతులకు అందకుండా చేశారని విమర్శించారు. కెసిఆర్ కిట్టు మహిళలకు అందించకుండా వేల కోట్లు ఎగబెట్టారని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్నది కాంగ్రెస్ అన్నారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఈ పార్టీని ఓడగొట్టారని అన్నారు. ‘ప్రామిస్ డే సందర్భంగా మీరు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డికి కోరుతున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపిలు జాప శ్రీకాంత్ రెడ్డి, దువ్వల మల్లయ్యనంగునూరు పిఏసిఎస్ ఛైర్మన్ కోలా రమేష్ గౌడ్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News