ఇద్దరు తెలుగు విద్యార్థులకు 100 పర్సంటైల్
సత్తా చాటిన బని బ్రాత మాజీ (తెలంగాణ),
మనోజ్ఞ గుత్తికొండ(ఆంధ్రప్రదేశ్)
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న జెఇఇ మెయిన్ 2025 తొలి విడత ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలలో మొత్తం 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) వెల్లడించింది. వారిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు 100 పర్సంటైల్ పొందారు. తెలంగాణకు చెందిన బని బ్రాత మాజీ, ఆంధ్రప్రదేశకు చెందిన మనోజ్ఞ గుత్తికొండ 100 పర్సంటైల్ స్కోరు సాధించారు. సోమవారం (ఫిబ్రవరి 10న) ఎన్‌టిఎ జెఇఇ మెయిన్ తొలి విడత తుది కీ విడుదల చేయగా, మంగళవారం విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేసింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
పరీక్ష రాసిన 12,58,136 మంది విద్యార్థులు
జెఇఇ మెయిన్ -2025 తొలి విడత పరీక్షను దేశవిదేశాలలో 304 నగరాలలో 618 పరీక్షా కేంద్రాలలో నిర్వహించారు. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా 13,11,544 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 12,58,136 మంది(95.93 శాతం) మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పేపర్ 1 (బిఇ/బి.టెక్ కోర్సులు) పరీక్షకు హాజరైన వారిలో 1,59,378 మంది అమ్మాయిలు, 3,06,980 మంది అబ్బాయిలు ఉన్నారు. జెఇఇ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరుగనున్నాయి. ఈ నెల 25 వరకు రెండో విడత జెఇఇ మెయిన్ 2 పరీక్షలకు
దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. తొలి విడత పరీక్ష రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకుంటారు. జెఇఇ మెయిన్ అర్హత సాధించిన వారిలో టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులకు జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు
1. ఆయుష్ సింఘాల్’(రాజస్థాన్)
2. కుషాగ్రా గుప్త(కర్ణాటక)
3. దక్ష్ (ఢిల్లీ)
4. హర్ష్ ఝా(ఢిల్లీ)
5.రజిత్ గుప్త (రాజస్థాన్)
6. శ్రిషాస్ లోహియా(ఉత్తర్‌ప్రదేశ్)
7. సాక్షం జిందాల్(రాజస్థాన్)
8. సౌరవ్(ఉత్తర్‌ప్రదేశ్)
9. విషాద్ జైన్(మహారాష్ట్ర)
10. అర్నవ్ సింగ్(రాజస్థాన్)
11. శివెన్ వికాస్ తోష్నివాల్(గుజరాత్)
12. సాయి మనోజ్ఞ గుత్తికొండ(ఆంధ్రప్రదేశ్)
13. ఓం ప్రకాష్ మహేరా(రాజస్థాన్)
14. బని బ్రత మాజీ(తెలంగాణ)