ఆ లక్షంతోనే ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది వర్గీకరణపై
కేబినెట్ సబ్‌కమిటీ,న్యాయకమిషన్ వేసి అధ్యయనం చేయించాం
వేగంగా నివేదిక తెప్పించి, కేబినెట్‌లో చర్చించి, అసెంబ్లీలో పెట్టాం
ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా వర్గీకరణ చేశాం
మందకృష్ణ మాదిగతో సిఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణను చిత్తశుద్ధితో
చేపట్టిన సిఎంకు కృతజ్ఞతలు చెప్పాను వర్గీకరణకోసం మూడు
దశాబ్దాలుగా పోరాటం షమీమ్ అక్తర్ నివేదికలో లోటుపాట్లు
ఉన్నాయి.. వాటిని సవరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశా
వర్గీకరణను నాలుగు గ్రూపులుగా చేయాలని కోరాం సిఎంను
కలిసివచ్చిన అనంతరం మీడియాతో మందకృష్ణ మాదిగ వర్గీకరణ
కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోనూ మందకృష్ణ భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలన్న మంచి ఉద్దేశంతోనే ప్రజా ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఉప కులాల ప్రతినిధులతో సిఎం మంగళవారం సమావేశమయ్యారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు ఎదురు కావొద్దన్న ఆలోచనతో ఈ ప్రక్రియను చట్టబద్దంగా ముందుకు తీసుకువెళ్లామ ని, అందులో భాగంగానే తొలుత అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ స బ్ కమిటీని నియమించడంతో పాటు న్యాయ కమిషన్ ఏర్పాటు చే శామని ఆయన వివరించారు. సాధ్యమైనంత తొందరగా ఈ నివేదికలను తెప్పించి, కమిషన్ సిఫార్సులను కేబినెట్‌లో, ఆ తర్వాత అ సెంబ్లీలో ఆమోదించామని సిఎం గుర్తుచేశారు.
ఎస్సీ ఉపకులాల వ ర్గీకరణ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని మందకృష్ణ ఈ సందర్భంగా అభినందించారు. వర్గీకరణ ప్రక్రియను ఒక నిబద్ధతతో చేపట్టిన ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సోదరుడిగా అండగా ఉంటానని సిఎం తో మందకృష్ణ తెలిపారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి స మస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌కు మందకృష్ణ సూచించారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాదిగ ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మందకృష్ణ మాదిగ కలిసి ఎస్సీ వర్గీకరణ గురించి పలు అంశాలపై చర్చించారు.
ఏ,బి,సి,డి గ్రూపులుగా వర్గీకరణ చేపట్టాలి: మందకృష్ణ
అనంతరం మందకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ఉప కులాల్లో ఏ, బి, సి మాత్రమే చేశారని తాము నాలుగు గ్రూపులుగా (ఏ,బి, సి,డి)లుగా చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్థించామని మందకృష్ణ పేర్కొన్నారు. మొదటి నుంచి తమ పోరాటం ఏ,బి,సి,డి వర్గీకరణ డిమాండ్‌తోనే సాగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాగే అమ లు చేశారని ఆయన గుర్తు చేశారు. తన ఉద్యమానికి మొదటి నుం చి సిఎం రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను సిఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై చట్ట సభలో తీర్మానం చేసినందుకు సిఎంకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపానని ఆయన తెలిపారు. ఉప కులాల్లో రిజర్వేషన్ల శాతం, గ్రూపుల విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లానని మందకృష్ణ పేర్కొన్నారు. అదేవిధంగా కులగణన లోపాలను సైతం సిఎంకు వివరించానని ఆయన తెలిపారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో రిజర్వేషన్‌ల శాతం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్న కులాల విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని సిఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు.
చేవెళ్ల డిక్లరేషన్‌ను అమలు చేయండి
రాష్ట్రంలోని ఎస్సీల్లో జనాభా పరంగా మూడో అతిపెద్ద కులంగా ఉన్న నేతకాని వర్గాన్ని, హోలియ దాసరి, మహార్ మరికొన్ని దళిత కులాలను కలిపి ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పాటు చేయాలని మందకృష్ణ సిఎంను కోరినట్టు తెలిపారు. తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇచ్చామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎస్సీల రిజర్వేషన్‌లను15 శాతం నుంచి 18 శాతం పెంచుతామన్న చేవెళ్ల డిక్లరేషన్‌ను కూడా అమలు చేయాలని ఆయన కోరారు.