ఎన్‌టి రామారావు, టి అంజయ్య, కె చంద్రశేఖర రావు, మమతా బెనర్జీ, లాలూప్రసాద్ యాదవ్, ఎల్‌కె అద్వానీ, దేవెగౌడ, రాజ్ నారాయణ… మొదలైన నాయకులంటే కార్టూనిస్టులకు చాలా ఇష్టమని అంటారు. ఎందుకంటే వారి ఆహార్యం, హావభావాలు, మాటలు, పోకడలు మొదలైనవి విభిన్నంగా, విలక్షణంగా ఉండటంవల్ల రాజకీయ వ్యంగ్య చిత్రకారులకు కుంచె నిండా పని. ఇలాంటి సందర్భం వార్తలను పేజీలలో అలంకరించే డెస్క్ జర్నలిస్టులకు ఒక్కోసారి కలుగుతుంది.
ఢిల్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్‌ఆద్మీ పార్టీ పూర్తిగా ఓడిపోయి, బిజెపి రావడం అనేది దేశవ్యాప్తంగా ఆదివారం రోజు పత్రికలకు పెద్ద వార్త అయింది. అందుబాటులో ఉన్న పది (3 ఇంగ్లీషు, 7 తెలుగు) దినపత్రికలను పరిశీలించిన తర్వాత వార్తలకు మకుటాలు పెట్టే సబ్ ఎడిటర్ మహారాజులు ఎంత ఆనందపడ్డారో అని అనిపించింది. ఆ పాత్రికేయానందాన్ని లేదా పాఠకానందాన్ని మీకు కూడా పంచుదామని ఈ రచన.
అమ్‌ఆద్మీ పార్టీ వాళ్ళ చిహ్నం చీపురు కావడంతో ది హిందూ పత్రిక ‘బిజెపి స్వీప్స్ క్యాపిటల్’ అని ప్రధాన శీర్షిక పెట్టింది. ఆంధ్రజ్యోతి అయితే కొంచెం చమత్కారంగా ‘చీపురునే ఊడ్చేసింది’ అంటూ ప్రధాన శీర్షికను అలంకరించింది. నిజానికి చీపురు, ఊడ్చడం అనే అర్థంవచ్చే మాటలు రాజకీయ నాయకుల ప్రకటనల్లో కూడా మనకు గత పదేళ్లుగా వినపడుతున్నాయి. ది పయనీర్ ఆంగ్లపత్రిక మొదటి పేజీలో ‘క్యాపిటల్ గెయిన్’ అనే మాటను వాడితే, ది హిందూ పత్రిక లోపలి పేజీల్లో ‘క్యాపిటల్ గెయిన్స్ ఫర్ బిజెపి’ అని వినియోగించింది. పార్టీ పేరు, చిహ్నం మాత్రమే కాకుండా ఆ పార్టీ నాయకుడి పేరు అరవింద్ కేజ్రీవాల్, ఆ పేరులోని కుదించిన రూపం ఎకె అనేవి కూడా ఆకర్షణీయం.
మన తెలంగాణ దినపత్రిక ‘కూలిన కేజ్రీవాల్’ అంటూ కూలిన, వాల్ అనే పదాలను ఎరుపు రంగులో చూపించి కూలిన గోడ అనే అర్థాన్ని స్ఫురింపజేసింది. ఆంధ్రజ్యోతి లోపల పేజీల్లో ‘కేజ్రీవాల్‌కు ’ఆప్’ద’ అంటూ ఆప్ అనే అక్షరాలను ఎరుపు రంగులో చూపించి ఆపదను ధ్వనించింది. డెక్కన్ క్రానికల్ ప్రధాన వార్త ఉప శీర్షిక ఇలా పెట్టింది: ‘కేజ్రీవాల్ అప్రూటేడ్ ఫ్రమ్ హిస్ సీట్’ రాస్తూ అప్రూటేడ్ అక్షరక్రమాన్ని AAProoted అని చమత్కారం చేసింది. అన్ని పత్రికల్లోకెల్లా ఆదివారం టైమ్స్‌ఆఫ్ ఇండియా భాషాపరంగా శీర్షికలలో చాలా చమత్కారాలు చేసింది. ‘ఎ డిసప్పియరింగ్ యాక్ట్’ అనే దానిని AD is APPearing Act అంటూ కేజ్రీవాల్ పార్టీ మాయం అని అర్థం వచ్చేలా తమాషాగా రాసింది.
రెండో మొదటి పేజీలో ‘గాన్ విత్ ది అరవింద్’ అనే దానిలో ఆ నాయకుడి పేరును Ar‘wind’ అని రాసి చాలా ప్రఖ్యాతమైన ఆంగ్ల నవల పేరును మనకు పరోక్షంగా గుర్తు చేసింది. అలాగే ‘కేజ్రీవాల్ టు కేజ్రీఫాల్’ అనే శీర్షికను పెట్టి గోడను, అది కూలడాన్ని స్ఫురింపచేస్తూ Wall పదాన్ని, Fall పదాన్ని ఎరుపు రంగులో హైలైట్ చేసింది. లోపల పేజీల్లో ‘ఢిల్లీ’స్ మోడీ గార్డెన్: బిజెపి స్వీప్స్ అవుట్ ఆప్’ అనే శీర్షికను వాడింది.
చాలామంది సబ్‌ఎడిటర్స్‌కి స్ఫురించని యాంగిల్ ను టైమ్స్ ఆఫ్ ఇండియా కార్టూనిస్టు సందీప్ ఆద్వార్యూ తన ‘లైన్ ఆఫ్ నో కంట్రోల్’ వ్యంగ్యచిత్రంలో తుపాకిని, ఎకె అనే ఆంగ్ల అక్షరాలను, బిజెపి గెలుచుకున్న సీట్లు సంఖ్య 48ను కలగలిపి ఇది బిజెపి పేల్చిన ఎకె 48 తుపాకీ అని ధ్వనించారు. అరవింద్ కేజ్రీవాల్ పేరును అక్షరాలుగా కుదిస్తే ఎకె అవుతుంది. ఆయన గెలిచినప్పుడు ఎకె 47 అనే రీతిలో ప్రచారం కూడా జరిగింది. రాజకీయ పార్టీల జయాపజయాలకు సంబంధం లేకుండా జర్నలిజం వృత్తిలో ఇటువంటి కొన్ని అపురూప సందర్భాలు వస్తుంటాయి. ఆ చమత్కారాలనూ వాటిలో ద్యోతకమైన శ్లేషలను, స్పార్క్‌ను పాఠకులు అందుకునే అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని 2025 ఢిల్లీ ఎన్నికలు, అందులో పాల్గొని పరాజయం పొందిన ఆమ్‌ఆద్మీ పార్టీ, దాని నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కల్పించారు.
డా నాగసూరి వేణుగోపాల్
9440732392