న్యూఢిల్లీ : ఎన్నికల ముందు ఉచిత పథకాల ప్రకటన విధానాన్ని సుప్రీం కోర్టు బుధవారం ఆక్షేపించింది. ఉచిత రేషన్, నగదు అందుతున్నందున పని చేయడానికి జనం సుముఖంగా లేరని కోర్టు వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు గూడు కల్పన హక్కు సంబంధిత పిటిషన్‌పై విచారణ సందర్భంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, అగస్టీన్ జార్జి మసీహ్‌తో కూడిన ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేసింది. ‘దురదృష్టవశాత్తు ఆ ఉచితాల కారణంగా జనం పని చేయడానికి సుముఖత చూపడం లేదు. వారు ఉచిత రేషన్లు పొందుతున్నారు. వారు ఏ పనీ చేయకుండానే నగదు అందుకుంటున్నారు’ అని జస్టిస్ గవాయ్ అభిప్రాయం వెలిబుచ్చారు.
‘వారి పట్ల మీ ఆందోళనను మేము గుర్తిస్తున్నాం. అయితే, వారిని సమాజంలో ప్రధాన స్రవంతిలో భాగం చేసి, దేశ అభివృద్ధికి పాటుపడేందుకు వారిని అనుమతించడం మెరుగు అవుతుంది కదా’ అని బెంచ్ పేర్కొన్నది. పేదరిక నిర్మూలన పథకం ఖరారు ప్రక్రియలో కేంద్రం ఉన్నదని, అది పట్టణ ప్రాంత నిరాశ్రయులకు గూడు కల్పించడంతో సహా వివిధ సమస్యలను పరిష్కరించగలదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి బెంచ్‌తో చెప్పారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకం ఎప్పటి నుంచి వర్తిస్తుందో కేంద్రం నుంచి ధ్రువీకరణ పొందవలసిందని అటార్నీ జనరల్‌ను బెంచ్ కోరింది. సర్వోన్నత న్యాయస్థానం ఆరు వారాల తరువాత ఈ విషయం విచారిస్తామని ప్రకటించింది.