లక్నో : అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. 85 ఏళ సత్యేంద్ర దాస్ కొంత కాలంగా మధుమేహం, అధిక రక్తపోటుతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఈ నెల 3న బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దానితో కుటుంబ సభ్యులు ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌జిపిజిఐ) ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలియజేశారు. సత్యేంద్ర దాస్ తన 20 ఏళ్ల వయస్సులోనే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దాస్ రామాలయం ప్రధాన పూజారిగా వ్యవహరిస్తున్నారు. 1992లో బాబ్రీ మసీడు కూల్చివేతకు ముందు నుంచే దాస్ రామమందిరం అర్చకుడిగా ఉన్నారు. సత్యేంద్ర దాస్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు.