న్యూఢిల్లీ : షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలన్న విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. విదేశాలకు వెళ్తే మళ్లీ తిరిగి వస్తారనే గ్యారంటీ లేదని పేర్కొంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం … ఈ కేసు విచారణను ఏడాది లోపల పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. “ మళ్లీ తిరిగి వస్తారన్న గ్యారంటీ లేదు. విచారణ తుది దశకు చేరుకుంది. విచారణ కొనసాగుతున్న వాస్తవాన్ని పరిగణన లోకి తీసుకొని, ఈ దశలో మీ విజ్ఞప్తిని అనుమతించలేం. విచారణ వేగవంతం చేసి ఏడాది లోగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తున్నాం ” అని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
ఇంద్రాణీ ముఖర్జీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తూ జులై 19న ట్రయల్ కోర్టు అనుమతులిచ్చింది. స్పెయిన్ , యూకే పర్యటనకు 10 రోజుల అనుమతి ఇచ్చింది. అయితే సీబీఐ అప్పీలుతో బాంబే హైకోర్టు ఈ తీర్పును పక్కన పెట్టింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఇంద్రాణీ ముఖర్జీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎంఎం సుందరేశ్ , జస్టిస్ రాజేశ్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇదిలా ఉంటే 2012లో తన కుమార్తె షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణీ ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టై 2015 నుంచి జైలులో ఉంటున్న ఆమెకు 2022లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని , సాక్షులతో సంప్రదింపులు జరపరాదని షరతులు విధించింది.న ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఇంద్రాణీకి చుక్కెదురయ్యింది.