న్యూయార్క్ : డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్‌తో సంబంధాలకు ప్రాథమ్యం ఇస్తున్నదని, ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని పటిష్ఠమైనదిగా మార్చేసత్తా ఆ దేశానికి ఉందని, చైనాతో సమర్థంగా పోటీ పడే విషయంలో అది‘ముఖ్య భాగస్వామి’ అని వైట్‌హౌస్ పూర్వపు అధికారి లిసా కుర్టిస్ చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ద్వైపాక్షిక సమావేశం నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ వైట్‌హౌస్‌ను సందర్శించడానికి ముందు లిసా కుర్టిస్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఆమె అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి ప్రభుత్వంలో 2017, 2021 మధ్య జాతీయ భద్రతా మండలి (ఎన్‌ఎస్‌సి)లో దక్షిణ, మధ్య ఆసియా విభాగం సీనియర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
మోడీ పర్యటనకు ముందు వాషింగ్టన్ డిసి కేంద్రంగా గల మేధో సంస్థ ‘దిసెంటర్ ఫర్ ఎ న్యూ అమెరికన్ సెక్యూరిటీ’ (సిఎన్‌ఎఎస్) నిర్వహించిన ఆన్‌లైన్ పత్రికా గోష్ఠిలో కుర్టిస్ మాట్లాడుతూ, ‘విస్పష్టంగా భారత్‌తో సంబంధాలకు ట్రంప్ ప్రభుత్వం ప్రాథమ్యం ఇస్తోంది’ అని తెలియజేశారు. ‘భారత్ ముఖ్యమైన ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తుందని వారు గుర్తిస్తున్నారు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో, ప్రపంచంలో పరివర్తన తీసుకురాగల సామర్థం నిజంగా ఉంది’ అని ఆ మేధో సంస్థలో ఇండో పసిఫిక్ భద్రత కార్యక్రమం సీనియర్ ఫెలో, డైరెక్టర్ కుర్టిస్ పేర్కొన్నారు. యుఎస్ 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం అనంతరం కొన్ని వారాలకు ఆయనతో భేటీ అవుతున్న నాలుగవ విదేశీ అధినేత మోడీ.
ట్రంప్ వైట్‌హౌస్‌లో రెండవ విడత బాధ్యతలు చేపట్టిన ఒక నెలలోనే ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లాకు ఆతిథ్యం ఇచ్చారు. ‘ట్రంప్ కొత్త ప్రభుత్వం కింద ఇక్కడ దేశీయంగా ప్రతి పరిణామంలో భారత్ పట్ల అటువంటి ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడం గమనార్హం’అని కుర్టిస్ వ్యాఖ్యానించారు. ‘అయితే, భారత ప్రభుత్వం కూడా ప్రాతిపదిక ఏర్పరచింది, గురువారం సమావేశం కోసం సకారాత్మక చర్యలు తీసుకొంది’ అని ఆమె చెప్పారు. క్వాడ్ కూడా ‘ట్రంప్ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైనది’ అని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వ ప్రకటనలు, వాణిజ్యం, టారిఫ్‌లపై దృష్టి కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ మోడీ భేటీ జరగబోతుండడంతో, ‘ఒక వాణిజ్య ఒప్పందానికి వచ్చే ప్రయత్నం చేయడం’ ఇద్దరు అధినేతలకు అవసరం అని కుర్టిస్ సూచించారు.