బంగ్లాదేశ్‌శలో మాజీ ప్రధాని షేక్ హసీనా హయాం లోని అప్పటి ప్రభుత్వంపై ఐక్యరాజ్యసమితి సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికారం చేజారకూడదనే ఉద్దేశంతో నిరసనకారులను హత్య చేసినట్టు ,దాడులు జరిపినట్టు పేర్కొంది. అవి మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలని అభివర్ణించింది. ఐరాస స్పందనను అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. 2024 లో జులై, ఆగస్టు నెలల్లో జరిగిన సంఘటనలకు సంబంధించిన విచారణ ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నాయి. ఆ సమయంలో సుమారు 1400 మంది ఆందోళనకారులు చనిపోయినట్టు వెల్లడించాయి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
దాంతో అప్పటి ప్రధాని షేక్‌హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆందోళనలు తీవ్రంగా ఉండటంతో ఆమె దేశం విడిచి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రస్తుతం హసీనాపై అనేక కేసులు నమోదయ్యాయి. బంగ్లాదేశ్‌కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెతోపాటు పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, మిలిటరీ అధికారుల పైనా అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. హసీనాను స్వదేశానికి రప్పించేందుకు బంగ్లా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.