Thursday, February 13, 2025

భారత్ క్లీన్ స్వీప్

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య టీమిండియా 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 30తో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ మెరుపు ఆరంభాన్ని అందించారు. డకెట్ దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. వరుస ఫోర్లతో భారత బౌలర్లను హడలెత్తించాడు. అయితే 22 బంతుల్లో 8 ఫోర్లతో 34 పరుగులు చేసి డకెట్‌ను అర్ష్‌దీప్ వెనక్కి పంపాడు.

ఆ తర్వాత ఇంగ్లండ్ మళ్లీ కోలుకోలేక పోయింది. భారత బౌలర్లు సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థి టీమ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 4 ఫోర్లతో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో ఇచ్చిన టామ్ బన్‌టన్ 4 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 38 పరుగులు సాధించాడు. జో రూట్ (24), హ్యారీ బ్రూక్ (19) పరుగులు చేశారు. చివర్లో గుస్ అట్కిన్సన్ 19 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 38 పరుగులు సాధించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ (6), లియమ్ లివింగ్‌స్టోన్ (9), ఆదిల్ రషీద్ (0), మార్క్‌వుడ్ (9) నిరాశ పరిచారు. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య రెండేసి వికెట్లను పడగొట్టారు.

ఆదుకున్న గిల్, కోహ్లి
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కిందటి వన్డేలో సెంచరీతో అలరించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈసారి నిరాశ పరిచాడు. రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఇటు కోహ్లి, అటు గిల్ సమన్వయంతో ఆడడంతో భారత్ కోలుకుంది. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన కోహ్లి, గిల్‌లు రెండో వికెట్‌కు వందకు పైగా పరుగులు జోడించారు. అయితే 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేసిన కోహ్లిని ఆదిల్ రషీద్ వెనక్కి పంపాడు.

శ్రేయస్ జోరు..
తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి గిల్ మరో కీలక పార్ట్‌నర్‌షిప్‌ను నమోదు చేశాడు. ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను ఫోర్లు, సిక్సర్లుగా మలుస్తూ ముందుకు సాగారు. ఇదే క్రమంలో మూడో వికెట్ 104 పరుగులు కూడా జోడించారు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్ 102 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. ఇక విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన శ్రేయస్ అయ్యర్ 64 బంతుల్లోనే 8 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 78 పరుగులు సాధించాడు. కెఎల్ రాహుల్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రాహుల్ 29 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. దీంతో భారత్ మెరుగైన స్కోరును నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు, మార్క్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు.

గిల్ అరుదైన రికార్డు
టీమిండియా యువ సంచలనం, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే సందర్భంగా గిల్ ఈ ఫీట్‌ను సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు సాధించిన బ్యాటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. గిల్ 50 ఇన్నింగ్స్‌లలోనే 2500 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో గతంలో సౌతాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. ఆమ్లా 59 ఇన్నింగ్స్‌లలో 2500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కానీ గిల్ ఈ ఘనత 50 ఇన్నింగ్స్‌లలోనే సాధించడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News