ఉచిత రేషన్, ఉచిత నగదుతో పని చేయడానికి
ఇష్టపడని జనం ఉచితాలతో సమాజంలో
పరాన్నజీవుల తరగతిని తయారు చేస్తున్నాం
పేదల పట్ల ప్రభుత్వ వైఖరి సరైనదే..అయినా
వారిని దేశాభివృద్ధిలో భాగం చేయకపోవడం
సమర్థనీయం కాదు రాజకీయ పార్టీల ఉచిత
హామీలపై సుప్రీంకోర్టు అసహనం
న్యూఢిల్లీ : ఎన్నికల ముందు ఉచిత పథకాల ప్రకటన విధానా న్ని సుప్రీం కోర్టు బుధవారం ఆక్షేపించింది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ‘ఉచితాలను’ వాగ్దానం చేస్తుండడాన్ని సు ప్రీం కోర్టు ప్రస్తావిస్తూ, ప్రజలను జాతీయ అభివృద్ధి కోసం ప్ర ధాన స్రవంతిలోకి తీసుకురావడానికి బదులు ‘మనం పరాన్నజీవుల తరగతిని సృష్టించడం లేదా’ అని ప్రశ్నించింది. ప్రజలను సమాజంలోని ప్రధాన స్రవంతిలో భాగం చేసి, జాతీయ అభివృద్ధికి దోహదం చేసేలా చూడడం శ్రేయస్కరం’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, అగస్టీన్ జార్జి మాసీహ్‌తో కూ డిన ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.‘దురదృష్టవశాత్తు, ఎన్నికల ప్రకటనకు సరిగ్గా ముందు ‘లడ్కీ బహిన్’, వంటి ఉచిత వరాల కారణంగా జనం పని చేయడానికి ఇష్టపడడం లేదు’ అ ని జస్టిస్ గవాయ్ చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు గూడు కల్పన హక్కు సంబంధిత
పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తున్నది. ఉచిత రేషన్, నగదు అందుతున్నందున పని చేయడానికి జనం సుముఖంగా లేరని కోర్టు వ్యాఖ్యానించింది. పేదల మీ ఆందోళనను మేము గుర్తిస్తున్నాం. అయితే, వారిని సమాజంలో ప్రధాన స్రవంతిలో భాగం చేసి, దేశ అభివృద్ధికి పాటుపడేందుకు వారిని అనుమతించడం మెరుగు అవుతుంది కదా’ అని బెంచ్ పేర్కొన్నది. పిటిషనర్లలో ఒకరి తరఫున హాజరవుతున్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రజలకు చేసేందుకు పని ఉన్నట్లయితే, పని చేయడానికి ఇష్టపడనివారు దేశంలో ఎవరూ లేరని అన్నారు. ‘మీకు ఒక వైపు సమాచారం ఉన్నట్లుంది. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మహారాష్ట్రలో సరిగ్గా ఎన్నికల ముందు ప్రకటించిన ఉచితాల కారణంగా వ్యవసాయదారులకు కూలీలు లభించడంలేదు’ అని న్యాయమూర్తి చెప్పారు. అయితే, తాము చర్చను కోరుకోవడం లేదని కోర్టు స్పష్టం చేసింది.
నిరాశ్రయులకు ఒక ఆశ్రయం కల్పించడంపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సహా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని కోర్టు తెలిపింది. ‘అయితే, అదే సమయంలో అది సమతూకంగా ఉండరాదా’ అని బెంచ్ అడిగింది. పేదరిక నిర్మూలన పథకం ఖరారు ప్రక్రియలో కేంద్రం ఉన్నదని, అది పట్టణ ప్రాంత నిరాశ్రయులకు గూడు కల్పించడంతో సహా వివిధ సమస్యలను పరిష్కరించగలదని వెంకటరమణి బెంచ్‌తో చెప్పారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకం ఎప్పటి నుంచి వర్తిస్తుందో కేంద్రం నుంచి ధ్రువీకరణ పొందవలసిందని, అది వర్తించే అన్ని అంశాలను రికార్డుగా తమ ముందు ఉంచాలని అటార్నీ జనరల్‌ను బెంచ్ కోరింది. ‘ఈలోగా సదరు పథకం అమలులోకి వచ్చేంత వరకు జాతీయ పట్టణ ప్రాంత జీవనోపాధి మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని ఉత్తర్వులను తీసుకోవలసిందిగా అటార్నీ జనరల్‌ను కోరుతున్నాం’ అని బెంచ్ తెలియజేసింది. అఖిల భారత ప్రాతిపదికపై పరిగణన నిమిత్తం అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం సేకరించవలసిందిగా కూడా కేంద్రాన్ని బెంచ్ కోరింది. నిరాశ్రయుల సమస్యను పరిష్కరించక పోవడం దురదృష్టకరమని, దానికి ప్రాథమ్యాల్లో చివరి స్థానం ఇస్తున్నారని విచారణ సమయంలో ఒక పిటిషనర్ ఆరోపించారు.
అధికారులు పేదలపై కాకుండా సంపన్నులపై అభిమానం చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించినప్పుడు బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ కోర్టుల రామ్‌లీలా మైదాన్ ఉపన్యాసం ఇవ్వకండి’ అని జస్టిస్ గవాయ్ అన్నారు. ‘అనవసర ఆరోపణలు చేయకండి. ఇక్కడ రాజకీయ ప్రసంగం చేయకండి. మా కోర్టు గదులను రాజకీయ సమరం (ప్రదేశం)గా’ మారనివ్వం’ అని ఆయన చెప్పారు. ‘సంపన్నుల పట్ల మాత్రమే అభిమానం చూపుతున్నారని మీరు ఎలా అంటారు? తుదకు ప్రభుత్వానికి సంబంధించినంత వరకైనా మీరు ఇలా ఎలా అంటారు?’ అని న్యాయమూర్తి అడిగారు. ప్రభుత్వం పేదల కోసం ఏమీ చేయలేదని గాని వారి పట్ల ఆందోళన వ్యక్తం చేయలేదని గాని అనడం సముచితం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. నిరుడు డిసెంబర్ 4న బెంచ్‌కు సమర్పించిన ఒక పత్రం ప్రకారం, రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 2557 ఆశ్రయాలు మంజూరు చేశాయని 1.16 లక్షల పడకలతో 1995 ఆశ్రయాలు పని చేస్తున్నాయని భూషణ్ కోర్టుకు తెలియజేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఆరు వారాల తరువాత ఈ కేసు విచారిస్తామని ప్రకటించింది.