Saturday, March 15, 2025

దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు పవన్ కళ్యాణ్ శ్రీకారం

- Advertisement -
- Advertisement -

దక్షిణ భారతదేశ ఆలయాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం కేరళ రాష్ట్రంలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చొట్టనిక్కరలోని శ్రీ అగస్త్య మహార్షి ఆలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన తనయుడు అకిరా నందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. అగస్త్య ఆలయం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు డాక్టర్ యోగిదాస్, ఇతర సభ్యులు పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికారు. కేరళ సంప్రదాయంతో ఆలయ పండితులు పవన్ కళ్యాణ్ కి పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత ఆయనతో ఆలయ సంప్రదాయాలను అనుసరించి ప్రదక్షిణ చేశారు. అనంతరం శ్రీ అగస్త్య మహార్షి వారికి పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న ఇతర మహా ఋషుల ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ ఆకృతిని, కట్టడాలను ఆసక్తిగా పరికించారు.

ఆశ్రమ వివరాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ : ప్రత్యేక పూజలు అనంతరం అగస్త్య ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు, మొక్కల గురించి ఆశ్రమ వైద్యులు విష్ణు యోగి, మణి యోగి వివరించారు. అగస్త్య మహార్షి పురాణాల్లో, వేదాల్లో చెప్పినట్లుగా కీలకమైన మర్మ చికిత్సకు మూలికలు ఎలా ఉపయోగపడతాయి అన్నది కూడా అడిగి తెలుసుకున్నారు. కలరిపయట్టు యుద్ధకళ గొప్పదనం గురించి, ఆశ్రమం ఆవరణలోనే ఉన్న శివలింగం ప్రాసస్త్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. లింగ శక్తి, శ్రీ శక్తి గురించి వివరించే పటాలను, చిత్రాలను పరికించారు. శివలింగం చెంతనే ఉన్న అఖండ జ్యోతికి నమస్కరించారు. అనంతరం అగస్త్య ఆశ్రమంలోనే ఉన్న గోశాలకు వెళ్లారు. ఆయుర్వేద చికిత్సలో గోవుల గొప్పతనాన్ని కూడా ఆశ్రమ నిర్వాహకులు పవన్ కళ్యాణ్ కి వివరించారు.

ఆయుర్వేద వైద్యం వివరాల సేకరణ : సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ ని బాధపెడుతున్న నడుము నొప్పి, స్పాండిలైటిస్ సమస్యకు ఆయుర్వేదంలో అవలంబించే చికిత్స విధానాలను పవన్ కళ్యాణ్ ఆశ్రమ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ అగస్త్య మహార్షి దర్శనం అనంతరం ఆశ్రమంలో ప్రత్యేకంగా అందించే చికిత్సాలయాన్ని సందర్శించారు. శ్రీ అగస్త్య ఆశ్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స నిమిత్తం ప్రతి రోజు 200 మందికి పైగా వస్తుంటారు. సుమారుగా 100 పడకల ప్రత్యేక వైద్యశాల వీరికి ఉంది. దీనికోసం 12 మంది వైద్యులతోపాటు సిబ్బంది ఇక్కడ పని చేస్తుంటారు. వివిధ దీర్ఘకాలిక నొప్పులు అలాగే

ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారికి వీరు ప్రత్యేకంగా ఆయుర్వేదంతోపాటు మర్మ చికిత్సను చేస్తారు. ఆయుర్వేదం మనిషిపై ప్రభావం చూపడానికి కాస్త సమయం తీసుకుంటుందిగాని, కచ్చితంగా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచిదని వైద్యులు పవన్ కళ్యాణ్ కి చెప్పారు.దీంతోపాటు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయుర్వేదంలో ఉన్న చికిత్స పద్ధతులను వివరించారు. అగస్త్య మహర్షి వేదాల్లో వివరించిన చికిత్స పద్ధతులు, సంప్రదాయాల గురించి ఆశ్రమ వైద్యులు పవన్ కళ్యాణ్ కి వివరించారు.

ఆలయాల సందర్శన పూర్తిగా నా వ్యక్తిగత అంశం : ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన తాజా పర్యటనకు, రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. ఇది వ్యక్తిగత పర్యటన అని, నాలుగున్నరేళ్ల కిందట చెల్లించుకోవాల్సిన మొక్కుల కోసం ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తన ఆరోగ్యం సహకరించకున్నా వచ్చానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News