27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్పుడు ఆప్‌ను బలహీనపరచగలననే ధీమాతో ఉన్నట్లు కనిపి స్తున్నది. మరిన్ని అవినీతి కేసులతో ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అదే విధంగా పంజాబ్‌లో ఆప్‌లో చీలికలు తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చనే ఊహాగా నాలకు ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే మన్ ఏక్‌నాథ్ షిండేగా మారవచ్చని బజ్వా ఆరో పించారు. బిజెపి కూడా పంజాబ్‌లో తాను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోతు న్నానని గ్రహించింది. సుదీర్ఘకాలం అకాలీదళ్ తో పొత్తు ఏర్పర్చుకున్నప్పటికీ పట్టణ ప్రాంతా లలో కొన్ని సీట్లను మించి గ్రామీణ ప్రాంతాలలోకి చొచ్చుకువెళ్లలేకపోయింది.
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం కూలిపోవడంతో ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం పంజాబ్‌లో ప్రభుత్వ మనుగడపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటమినుండి కోలుకోకముందే హడావుడిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీలో పంజాబ్ పార్టీ ఎంఎల్‌ఎల సమావేశం ఏర్పాటు చేయడం గమనిస్తే ఆయనలో కంగారు కనిపిస్తుంది. ఈ సందర్భంగా పలు ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. బిజెపి సైతం తమ తర్వాతి లక్ష్యం పశ్చిమ బెంగాల్, పంజాబ్ అని చెప్పడం గమనార్హం. పశ్చిమ బెంగాల్‌లో అయితే వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగవలసి ఉండడంతో ఆ రాష్ట్రంపై దృష్టి సారించడాన్ని అర్థ్ధం చేసుకోవచ్చు. కానీ మరో రెండేళ్ల పదవీకాలం ఉన్న పంజాబ్ ప్రభుత్వంపై దృష్టి సారించడం అంటే ప్రభుత్వాన్ని అస్థిరం కావించే ప్రయత్నం చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సందర్భంగా పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా చేస్తున్న ప్రకటనలు గందరగోళం కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ బిజెపికి తదుపరి ‘ఏక్‌నాథ్ షిండే’ అని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి ద్వారానే ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నం చేస్తారా? అనే అనుమానం కలుగుతుంది. మరోవంక, ఆయనే 30 మంది ఆప్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటూ కలకలం రేపారు. అయితే, ఆయన ప్రకటనలను మాన్ ఖండించారు అనుకోండి. ఇట్లా ఉండగా, మాన్‌ను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించేందుకు స్వయంగా కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారని అంటూ ఢిల్లీలో ఎంఎల్‌ఎ గా ఎన్నికైన బిజెపి నేత మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపణలు చేశారు. తానే పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని కేజ్రీవాల్ చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా ఢిల్లీ ప్రభుత్వం కోల్పోవడంతో కేజ్రీవాల్ ఇక ఎక్కువగా పంజాబ్ ప్రభుత్వంపై దృష్టి సారిస్తారన్నది మాత్రం యదార్థం.
దానితో అక్కడి ప్రభుత్వం ఆయన కనుసన్నలలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆప్ రాజకీయ కార్యకలాపాలకు అవసరమైన వనరులను సమకూర్చాల్సిన బాధ్యత కూడా మొత్తంగా పంజాబ్ ఆప్‌పై పడుతుంది. పైగా, పుష్కర కాలంగా ఆప్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ‘ఢిల్లీ మోడల్’ తాజా ఎన్నికల్లో విఫలమైంది. ఆ పేరుతో ఓట్లు రాబట్టడం ఇంకేమాత్రం సాధ్యం కాదని వెల్లడైంది. పంజాబ్‌లో సైతం ‘ఢిల్లీ మోడల్’ పేరుతో అధికారంలోకి వచ్చారు. అందుకనే పంజాబ్‌లో తమ ఎత్తుగడలను మార్చుకొనని పక్షంలో 2027లో జరిగే ఎన్నికలలో నెగ్గుకు రావడం సాధ్యం కాదు. దానితో ప్రభుత్వ ప్రాధాన్యతలను పూర్తిగా మార్చుకోవలసి ఉంది. అయితే మహారాష్ట్రలో మాదిరిగా మరో ఏక్‌నాథ్ షిండే ద్వారా పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం బిజెపికి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బిజెపికి ఇద్దరు మాత్రమే ఎంఎల్‌ఎలు ఉన్నారు. ఒక్క ఎంపి కూడా లేరు.
మహారాష్ట్రలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయినా వరుసగా మూడు ఎన్నికలలో అతిపెద్ద పార్టీగా ఏర్పడింది. దానితో అక్కడ రాజకీయంగా ఆధిపత్యంలో ఉండగలిగింది. పైగా, ఆప్ తర్వాత అన్ని వర్గాలలో చెప్పుకోదగిన బలం ఉన్న పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ ఆ పార్టీలో వర్గాలకు అంతులేదు. ఒక నాయకుడంటే మరో నాయకుడికి పడదు. కొత్తగా ఆప్ నాయకులను చేర్చుకొంటే మరో కుంపటి ఏర్పాటు చేసుకున్నట్లు కాగలదు.
అయితే, అరుణాచల్‌ప్రదేశ్ మోడల్‌లో పంజాబ్ ప్రభుత్వంపై బిజెపి కన్నేసే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. 2014 అరుణాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. రెండేళ్ల తర్వాత సిఎం నబమ్ తుకి తప్ప మిగతా కాంగ్రెస్ ఎంఎల్‌ఎలందరూ పార్టీ నుంచి విడిపోయి పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌లో చేరారు. ఈ ఎంఎల్‌ఎలలో ఎక్కువ మంది కొన్ని నెలల తర్వాత బిజెపిలో విలీనం అయ్యారు. ఆ విధంగా బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీతో బిజెపి ఇప్పటికే విలీనమై అటువంటి ఓ ప్రయత్నం చేసింది. అయినా ప్రయోజనం లేకపోయింది. 2022లో పంజాబ్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆప్ ఇప్పటివరకు చీలికల నుండి సురక్షితంగా ఉంది. వ్యక్తిగత ఎంఎల్‌ఎలు కూడా పెద్దగా ఫిరాయింపులకు పాల్పడిన దాఖలాలు లేవు. ఢిల్లీలో కూడా, 2025 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంతమంది నాయకులు బిజెపిలో చేరడం తప్ప, ఆప్ పెద్దగా చీలికలకు గురికాలేదు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బిజెపి ఇప్పుడు ఆప్‌ను బలహీనపరచగలననే ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నది. మరిన్ని అవినీతి కేసులతో ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అదే విధంగా పంజాబ్‌లో ఆప్‌లో చీలికలు తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చనే ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే మన్ ఏక్‌నాథ్ షిండేగా మారవచ్చని బజ్వా ఆరోపించారు.
బిజెపి కూడా పంజాబ్‌లో తాను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోతున్నానని గ్రహించింది. సుదీర్ఘకాలం అకాలీదళ్‌తో పొత్తు ఏర్పర్చుకున్నప్పటికీ పట్టణ ప్రాంతాలలో కొన్ని సీట్లను మించి గ్రామీణ ప్రాంతాలలోకి చొచ్చుకువెళ్లలేకపోయింది. కాబట్టి రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు ఇప్పుడు బిజెపికి ఏకైక మార్గం రాష్ట్రంలోని ఇతర 3 పార్టీలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ (ఆప్, కాంగ్రెస్, ఎస్‌ఎడి) పార్టీలలో చీలికలు తీసుకు రావడమే. అయితే, 2020- 21 రైతుల నిరసన సమయంలో మాదిరిగా ఇప్పుడు పంజాబ్‌లో బిజెపి పట్ల ప్రతికూలత అంత తీవ్రంగా ఉండకపోవచ్చు గాని, చెప్పుకోదగినంతగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ సిక్కు జనాభాలో ప్రతికూలత ఎక్కువగా ఉంది. అందువల్ల, ఎవరైనా బిజెపితో చేతులు కలపడానికి ఆప్ లేదా కాంగ్రెస్ లేదా ఎస్‌ఎడిలను విభజించినట్లయితే, కనీసం గ్రామీణ ఓటర్లలో రాజకీయంగా నష్టం వాటిల్లుతుంది. ఉదాహరణకు, పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి బలమైన అభ్యర్థి రవ్‌నీత్ బిట్టు లూథియానాలోని గ్రామీణ ప్రాంతాలలో దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సిక్కు ఓటర్లలో బిజెపి పట్ల నెలకొన్న ప్రతికూలత సైతం పంజాబ్‌లో ఆ పార్టీ విస్తరణకు అడ్డంకిగా నెలకొంది.
ఢిల్లీ ఎన్నికల్లో బిజెపి సిక్కు అభ్యర్థులు చాలా మంది గెలిచారు. రాజౌరి గార్డెన్ నుండి మంజిందర్ సింగ్ సిర్సా, గాంధీనగర్ నుండి అరవిందర్ సింగ్ లవ్లీ, జంగ్పురా నుండి తర్విందర్ మార్వా వంటి వారు గెలుపొందగారు. ఆప్ సిక్కు అభ్యర్థులలో తిలక్ నగర్ నుండి జ్నల్ సింగ్, చాందిని చౌక్ నుండి పునర్దీప్ సింగ్ సాహ్నీ గెలుపొందారు. ఆప్ నుండి సురీందర్ పాల్ సింగ్ బిట్టూ, జితేందర్ సింగ్ షుంటి వరుసగా తిమార్పూర్, షాదరాలో బిజెపి చేతిలో తృటిలో ఓడిపోయారు. అయితే, సిక్కులలో బిజెపి ఇప్పటికీ గణనీయమైన తేడాతో వెనుకబడి ఉండవచ్చని సర్వేలు సూచిస్తున్నాయి. యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం 69 శాతం సిక్కులు ఆప్‌కు ఓటు వేయగా, 24 శాతం మంది బిజెపికి ఓటు వేశారు. సివోటర్ సర్వే ప్రకారం 49 శాతం సిక్కులు ఆప్‌కు ఓటు వేయగా, బిజెపికి 34 శాతం మంది ఓటు వేశారు. సిర్సా, లవ్లీ, మార్వా వంటి బలమైన సిక్కు అభ్యర్థులు ఉన్న ప్రదేశాలలో ఆ వర్గం బిజెపికి మద్దతు ఇచ్చి ఉండవచ్చు, అయితే ఇతర చాలా స్థానాల్లో ఆప్ మొదటి ప్రాధాన్యతను పొందింది.
ఢిల్లీ సిక్కులు పంజాబ్‌లోని వారి కంటే భిన్నమైన ఓటింగ్ సరళిని కలిగి ఉన్నప్పటికీ, జాతీయ రాజధానిలో సిక్కులలో ఆప్ ఇప్పటికీ నంబర్ వన్ ఎంపికగా ఉందన్నది వాస్తవం. రెండు సర్వేల ప్రకారం కాంగ్రెస్‌కు మద్దతు 5 శాతం కంటే తక్కువకు తగ్గింది. ఈ వాస్తవాలు పంజాబ్ లో ఆప్‌కు బలమైన ప్రాతిపదిక ఏర్పాటుకు దారితీస్తుంది.
మరోవంక, అకాలీదళ్ తీవ్రమైన నాయకత్వ సంక్షోభంలో మునిగిపోవడం సైతం ఆ పార్టీకి కలిసి వస్తుంది. మరోవంక, కేజ్రీవాల్, ముఖ్యమంత్రి మాన్‌ల మధ్య ఎన్నడూ ఎటువంటి విభేదాలు తలెత్తిన సందర్భాలు లేవు. కేజ్రీవాల్‌కు నమ్మినబంటుగా వ్యవహరిస్తున్నారు. పైగా, ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం లేకపోవడంతో మొత్తం ఆప్ పంజాబ్ ప్రభుత్వంపై ఆధారపడాల్సి ఉంటుంది. దానితో ఆప్‌లో మాన్ ప్రాధాన్యత మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆ ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు ఆప్ నుండి ప్రయత్నాలు జరిగే అవకాశాలు తక్కువ. ఇంకోవైపు, కేజ్రీవాల్, ఆప్ ఢిల్లీ నాయకత్వంతో పోలిస్తే, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ కేంద్రంతో మెరుగైన సంబంధాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వపరంగా ఎటువంటి ఘర్షణలకు దిగడం లేదు. అమృత్‌పాల్ సింగ్, అతని సంస్థ వారిస్ పంజాబ్ దేపై జరిగిన అణచివేతలో, పంజాబ్ పోలీసులు కేంద్రంతో సన్నిహిత సమన్వయంతో పని చేశారు.
అమృత్‌పాల్, అతని సన్నిహితులను అసోంలోని దిబ్రుగఢ్ జైలుకు పంపడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చురుకైన సమన్వయం లేకుండా జరిగేది కాదు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల ఎత్తుగడలు ఇప్పుడు ఏ విధంగా ఉంటాయో అన్న విషయమై పంజాబ్ పరిణామాలు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. వారు నిజంగా పంజాబ్‌లో ‘ఏక్‌నాథ్ షిండే మోడల్’ను ప్రయత్నిస్తారా? అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. ఆప్ బలహీనపడితే, పంజాబ్‌లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ, ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ బజ్వా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌ల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరాటం ఆ పార్టీని మరింత బలహీనపరిచే అవకాశం ఉంది.
చలసాని నరేంద్ర
9849569050