Thursday, February 13, 2025

నొప్పించక, తానొవ్వక…

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యాధిపతిగా రెండోసారి అధికారంలోకి వచ్చాక డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అంతకుమించి, ప్రపంచ దేశాల మీద అవి ప్రతికూల ప్రభావాన్ని కనబరుస్తున్నాయనడంలో సందేహం లేదు. ఈ జాబితాలో చిరకాల మిత్రదేశం భారత్ కూడా ఉండటమే ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్ మధ్య గురువారం జరగబోతున్న ద్వైపాక్షిక సమావేశానికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. వాషింగ్టన్ వేదికగా జరగబోయే ఈ భేటీలో అక్రమ వలసలు, సుంకాల విధింపు, రక్షణరంగ సహకారం వంటి అనేక కీలక విషయాలు చర్చకు వచ్చే ఆస్కారం ఉన్నందున ఎవరిది పైచేయి అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ‘ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆయన ప్రభుత్వం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటానికి సహకరించింది.

ఇప్పుడు దాన్ని కొనసాగించే అవకాశం లభించింది’ అంటూ ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, అది అంత సులభంగా జరిగే పనికాదనే సంగతి తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది. వాస్తవానికి ఇరువురు అగ్రనేతల మధ్య స్నేహసంబంధాలు ఉన్నప్పటికీ, అగ్రరాజ్యానికి ఆసియాలో భారత్ చెప్పుకోదగిన మిత్రదేశమన్న సంగతి జగమెరిగిన సత్యమైనప్పటికీ, భారత్ పట్ల ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందనేది వాస్తవం. సహజంగానే దూకుడుతో వ్యవహరిస్తూ, దుందుడుకు నిర్ణయాలు తీసుకునే స్వభావం గల ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక మరింత అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. వచ్చీ రాగానే అక్రమ వలసదారులపై విరుచుకుపడటమే కాదు, ఒక్కొక్కరిపై అధికమొత్తంలో డబ్బు వెచ్చించి, సంకెళ్లు వేసి మరీ తిరుగుటపాలో పంపిస్తున్నారు.

ఈ విషయంలో భారత్‌కూ ఆయన మినహాయింపు ఇవ్వలేదు. అంతేకాదు, కీలక వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్ పై అధిక సుంకాలు విధించేందుకు సైతం రంగం సిద్ధం చేస్తున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరం భారత్- అమెరికా దేశాల మధ్య 120 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్ ఎగుమతుల కంటే, అమెరికానుంచి దిగుమతయ్యే ఉత్పత్తుల వాటాయే ఎక్కువ. అయినా ఇవేమీ ఆయనకు పట్టడం లేదు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందంటూ విమర్శించే ట్రంప్, అవకాశం వచ్చినప్పుడల్లా భారత్ ను ‘టారిఫ్ కింగ్’ గా ఎద్దేవా చేస్తూ ఉంటారు. కానీ, అధిక సుంకాలు విధించడంలో అమెరికా తక్కువేం తినలేదు. ఆ దేశంనుంచి దిగుమతయ్యే విస్కీలాంటి ఉత్పత్తులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తుంటే, పొగాకు వంటి భారతీయ ఉత్పత్తులపై అమెరికా అంతకు రెట్టింపు సుంకాలు వసూలు చేస్తోంది.

ఈ విషయంలో అగ్రరాజ్యంతో కలహానికి కాలు దువ్వకుండా, భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బడ్జెట్లో లగ్జరీ కార్లు, మోటార్ సైకిళ్లు, లిథియం అయాన్ బ్యాటరీలు, సెల్ ఫోన్ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం ద్వారా ట్రంప్ కోపాన్ని తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టింది. దీనివల్ల హార్లే డేవిడ్సన్, టెస్లా, యాపిల్ వంటి అనేక అమెరికన్ కంపెనీలకు లాభం చేకూరుతుంది. ఇదే విషయాన్ని ద్వైపాక్షిక భేటీలో ప్రస్తావించి, సుంకాల విధింపు విషయమై పరస్పర ఒడంబడికను కుదుర్చుకుని, వాణిజ్యబంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా ప్రధాని అడుగులు వేస్తారని ఆశించవచ్చు. భారత్- అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో రక్షణరంగ సహకారం కూడా కీలకమైనది. ఇప్పటికే చినూక్ హెలికాప్టర్లు, సాయుధ డ్రోన్లు వంటి వాటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన భారత్, యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిళ్లకు లొంగడం లేదు.

ఫ్రెంచ్ రఫేల్, రష్యన్ సుఖోయ్ విమానాలవైపు మొగ్గు చూపిస్తున్న భారత్‌ను దారికి తెచ్చుకుని తమ అధునాతన ఫైటర్ జెట్లను ఇండియాకు విక్రయించాలన్నది అమెరికా అభిమతం. ఈ విషయంలో ట్రంప్ బుట్టలో పడకుండా నేర్పుగా వ్యవహరించడం ముఖ్యం. అగ్రనేతల భేటీలో హెచ్1బి వీసాల విషయం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే ఆస్కారం ఉంది. తమ దేశానికి నిపుణుల అవసరం ఉందని ట్రంప్ స్వయంగా అంగీకరించిన నేపథ్యంలో హెచ్1బి వీసాలపై అమెరికాకు వెళ్లే భారతీయ టెక్ నిపుణులకు ఆటంకాలు ఎదురుకాకుండా చూడవలసిన అవసరం ఉంది. తన మాట వినని దేశాలను నయానో భయానో దారికి తెచ్చుకోవడం ట్రంప్ నైజం. అధిక సుంకాలు విధిస్తామని భయపెట్టి కొలంబియా, మెక్సికోలను దారికి తెచ్చుకున్నట్లే భారత్‌ను కూడా గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్న ట్రంప్ ఎత్తుగడలకు చిత్తుకాకుండా నొప్పించక తానొవ్వక అన్న చందంగా నేర్పరితనంతో కాగల కార్యాన్ని సాధించుకురావలసిన అవసరం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News