Friday, February 14, 2025

బస్తీ దవాఖానల పనితీరు దుర్భరం:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫైఫల్యంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌కు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఏం చేస్తున్నట్లు..? అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో బస్తీ దవాఖానల పనితీరు దుర్భరంగా ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానల్లో ఎందుకు ఓపీ పడిపోయిందని అడిగారు. పల్లె, బస్తీ దవాఖానలు ప్రారంభించి ప్రజల సుస్తీని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పోగొడిగే, ఆ దవాఖానలకే సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.

పట్టణ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన దవాఖానలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దిక్కుమొక్కు లేక మూతబడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రేటర్ సహా రాష్ట్రవ్యాప్తంగా 500 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిందని, ఇదేవిధంగా గ్రామాల్లో పల్లె దవాఖానలు ప్రారంభించిందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం ప్రశంసలను సైతం మన బస్తీ దవాఖానలు అందుకున్నాయని గుర్తు చేశారు. కెసిఆర్ పదేళ్లలో తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశానికే రోల్ మోడల్‌గా నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజలకు వైద్య సేవలు అందించడం అనేది ఈ ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో లేకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, వైద్యారోగ్య మంత్రి ఇప్పటికైనా పల్లె, బస్తీ దవాఖాన, తెలంగాణ డయాగ్నొస్టిక్ సమస్యలను పరిష్కరించి, పేద ప్రజలకు వైద్యం అందేలా చూడాలని హరీష్‌రావు బిఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News