మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి పాలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొమ్మిదిన ముఖ్యమంత్రి పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో కేంద్రం, రాష్ట్రపతి పాలన విధించింది. బీరేన్ సింగ్ వారసుడిని ఎంపిక చేయడంలో బీజేపీ ఏకాభిప్రాయాన్ని సాధించలేక పోయింది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి విపక్షాలు సిద్ధమవుతున్న తరుణంలో ఒకరోజు ముందుగా బీరేన్ సింగ్ తన పదవి నుంచి తెలివిగా తప్పుకున్నారు. దీనికి తోడు జాతుల మధ్య ఘర్షణలో బీరేన్ సింగ్ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. కుకీలతో ఘర్షణకు మెయితీ వర్గాలకు ఆయుధాలు, పేలుడు పదార్ధాలు లూటీ చేసుకోవచ్చని వివరించే సం భాషణతో కూడిన ఆడియో క్లిప్పింగ్ వ్యవహారం బీరేన్‌సింగ్‌ను ఇరకాటంలో పెట్టింది.
ఆ ఆడియోలో సంభాషణ బీరేన్‌సింగ్‌దే అని నిరూపించే విధంగా ఉంది. దీనిపై సుప్రీంకోర్టు ఫోరెన్సిక్ నివేదికను కోరింది. ఈ నేపథ్యం లో బీరేన్‌సింగ్ రాజీనామా చేశారు. బీరేన్‌సింగ్ రాజీనామా తరువాత గవర్నర్ అజయ్‌భల్లా బడ్జెట్ సమావేశాలను రద్దు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల మధ్య వ్యవధి ఆరు నెలలకు మించరాదు. ఆరు నెలల్లో తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించవలసి ఉంటుంది. అయితే మణిపూర్ చివరి అసెంబ్లీ సమావేశం 2024 ఆగస్టు 12న జరిగిం ది. ఆ తరువాత కాలేదు. తదుపరి అసెంబ్లీ సమావేశానికి బుధవారంతో గడవు తీరిపోయింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి సిద్ధం అవుతుండగా బీరేన్‌సింగ్ రాజీనామా చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. గత రెండేళ్లుగా జాతుల మధ్య హింసాత్మక సంఘర్ణణలు జరుగుతుంటే ముఖ్యమంత్రి పదవికి బీరేన్‌సింగ్ ఇప్పుడు రాజీనామా చేయడం ఒక డ్రామా అని,
ఈ రాజీనామా బీజేపీని రక్షించడానికే తప్ప ప్రజల కోసం కాదని కాంగ్రెస్ ఎండగట్టింది. 2023 నుంచి దాదాపు రెండేళ్లుగా హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలుతో మణిపూర్ రావణ కాష్ఠం లా రగులుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షమందికి పైగా కట్టుబట్టలతో ఊళ్లు విడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.