Saturday, February 15, 2025

నోటా వోట్ల శాతంలో క్రమేపీ క్షీణత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇవిఎంలలో ‘పైవారు ఎవరూ కాదు’ ఆప్షన్ 2013లో ప్రవేశపెట్టినప్పటి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యల్ప శాతం నమోదైనట్లు ఎన్నికల కమిషన్ (ఇసి) డేటా వెల్లడించింది. నోటా ఆప్షన్‌ను మొదటిసారి 2014 లోకసభ ఎన్నికల్లో అమలులోకి తీసుకువచ్చారు. నిరుటి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన డేటా ఉన్న పుస్తకం ఎన్నికల కమిషన్ ‘అట్లాస్ 2024’ ప్రకారం, గడచిన మూడు లోక్‌సభ ఎన్నికల్లో నోటా వోట్లలో క్రమంగా క్షీణత ఉన్నది. 2014లో 1.08 శాతంగా ఉన్న నోటా వోట్లు 2024 ఎన్నికల్లో 0.99 శాతానికి తగ్గాయి. వోట్ల శాతం స్వల్పంగా కనిపించినప్పటికీ, నోటా వోట్ల మొత్తం సంఖ్య, ముఖ్యంగా తక్కువ గెలుపు తేడాలు ఉన్న సీట్ల విషయంలో ఇప్పటికీ గణనీయంగానే ఉన్నది.

కొన్ని నియోజకవర్గాల్లో నోటా వోట్లు ఫలితాలను ప్రభావితం చేసి ఉండేవే. రాష్ట్రాల వ్యాప్తంగా నోటా వోట్ల పంపకం గణనీయమైన అంతరాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాంతీయ రాజకీయ చిత్రాన్ని, వోటర్ల ప్రాధాన్యాలను, రాజకీయ పాత్ర స్థాయిలను అది ప్రతిబింబిస్తోంది. బీహార్ అత్యధిక నోటా వోట్ల వాటా (పర్సంటేజ్) 2.07 శాతాన్ని నమోదు చేయగా, దాద్రా నగర్ హవేలి, దామన్ డయ్యూ 2.06 శాతం, గుజరాత్ 1.58 శాతంతోఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. అందుకు భిన్నంగా నాగాలాండ్ కేవలం 0.21 శాతంతో నోటా వోట్ల అత్యల్ప వాటాను నమోదు చేసింది. రాష్ట్రంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల పట్ల ప్రాధాన్యాన్ని లేదా బలమైన సమీకరణాన్ని అది సూచిస్తోంది.

రాష్ట్రాల వ్యాప్తంగా అటువంటి భిన్న సరళులను రాజకీయ పోటీ, ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యం, ఒక్కొక్క ప్రాంతంలో మొత్తంగా వోటర్ల ప్రాథమ్యం వంటి అంశాలు ప్రభావితం చేసి ఉండవచ్చు. ఆ అంతరం విభిన్న మార్గాలను ఎత్తిచూపుతోంది. ఎన్నికల ప్రక్రియతో వోటర్ల ప్రమేయం, ఒక అభ్యర్థిని ఎంచుకోవడంలో క్రియాశీలకంగా పాల్గొనడం లేదా నిరసన లేక అసమ్మతి సూచనకు ఒక సాధనంగా నోటా వినియోగం ద్వారా వారి ప్రాధాన్యాల వ్యక్తీకరణను అది ప్రతిబింబిస్తోంది. 2013లో ప్రవేశపెట్టగా, ఇవిఎంలపై నోటా ఆప్షన్‌కు నల్ల క్రాస్‌తో ఒక బ్యాలట్ పత్రం రూపంలో సొంత చిహ్నం ఉంది.

సుప్రీం కోర్టు 2013 సెప్టెంబర్‌లో ఒక ఉత్తర్వు జారీ చేసిన అనంతరం వోటింగ్ ప్యానెల్‌పై చివరి ఆప్షన్‌గా ఇవిఎంలపై నోటా మీటను ఇసి చేర్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుకు ముందు, ఏ అభ్యర్థికీ వోటు వేయకూడదనుకునే వారికి ఫార్మ్ 49ఒను పూర్తి చేసే ఆప్షన్ ఉండేది. అయితే, 1961 నాటి ఎన్నికల నిర్వహణ నిబంధనావళిలోని 49ఒ నిబంధన కింద పోలింగ్ కేంద్రంలో ఆ ఫారమ్‌ను నింపడం వోటర్ గోప్యతకు భంగం కలిగినట్లు అయ్యేది. అయితే, వోటింగ్ సమయంలో నోటా ఆప్షన్‌ను మెజారిటీ వోటర్లు వినియోగించుకున్నట్లయితే, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఇసిని ఆదేశించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News