న్యూఢిల్లీ : ఒక నిర్దిష్ట రీతిలో చట్టం చేయవలసిందిగా శాసనవ్యవస్థను న్యాయస్థానాలు ఆదేశించజాలవని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు నిరుడు ఫిబ్రవరిలో జారీ చేసిన ఒక ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన ఒక పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బి ఆర్ గవాయ్, అగస్టీన్ జార్జి మాసీహ్‌తో కూడిన ధర్మాసనం ఆ వ్యాఖ్య చేసింది. ఈ అంశంపై ఒక పిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. సుప్రీం కోర్టు బెంచ్ పిటిషన్ విచారణకు నిరాకరిస్తూ, ‘ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న తరువాత పార్లమెంట్ కొత్త చట్టంతో వచ్చింది. రిట్ న్యాయ పరిశీలనలో హైకోర్టులు గాని, సుప్రీం కోర్టు గాని ఒక నిర్దిష్ట పద్ధతిలో ఒక చట్టం చేయవలసిందిగా శాసనవ్యవస్థను ఆదేశించజాలవు’ అని వ్యాఖ్యానించింది.
ఫిర్యాదీకి లేదా బాధితునికి ఉచితంగా చార్జిషీట్ ప్రతిని అందజేయాలని జిల్లా కోర్టులను లేదా పోలీసులను ఆదేశించవలసిందిగా పిల్ కోరింది. కేంద్రం తరఫున హాజరవుతున్న న్యాయవాది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్) 2023లోని సెక్షన్ 230ని ప్రస్తావిస్తూ, ఆ పిటిషన్ నిరర్ధకమని అన్నారు. పోలీస్ నివేదికపై విచారణ ప్రక్రియ ప్రారంభించిన ఏ కేసులోనైనా మేజిస్ట్రేట్ నిందితునికి, బాధితునికి పోలీస్ నివేదిక, ఎఫ్‌ఐఆర్ సహా డాక్యుమెంట్ల కాపీని ఉచితంగా అందజేయాలని సెక్షన్ 230 నిర్దేశిస్తోందని కేంద్రం న్యాయవాది తెలియజేశారు. ఫిర్యాదీ లేదా బాధితుని వాదన వినే హక్కు, విచారణ ముందు క్రిమినల్ ప్రక్రియలో పాల్గొనే హక్కు గురించి బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 230 పట్టించుకోవడం లేదని పిటిషనర్ న్యాయవాది తెలిపారు.