మ్యూనిచ్ : భారత్ ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ తాము అద్భుతంగా జీవిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. వోటింగ్‌లో పాల్గొని ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తాను వోటు హక్కు వినియోగించుకున్నానని జైశంకర్ చెబుతూ తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపించారు. జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో 61వ మ్యూనిచ్ భద్రత మహాసభ జరుగుతోంది. ఆ మహాసభలో పాల్గొన్న జైశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యం కష్టాల్లో కూరుకుపోయిందా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వాదనతో తాను ఏకీభవించనని ఆయన చెప్పారు.
భారత ఎన్నికల ప్రక్రియపై తనకు విశ్వాసం ఉందని మంత్రి తెలియజేశారు. భారత్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎటువంటి వివాదాలూ ఉండవని జైశంకర్ చెప్పారు. ప్రజాస్వామ్యం మన అవసరాలు తీర్చదని ఒక సెనేటర్ వ్యాఖ్యానించారు. దీనికి జైశంకర్ సమాధానం ఇస్తూ, ప్రజాస్వామ్య భారత్ దాదాను 80 కోట్ల మందికి పోషకాహార సహాయం అందజేస్తోందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం సమర్థంగా పని చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయనే విషయాన్ని మాత్రం అంగీకరిస్తున్నానని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాల్లో దీనిని ఒకే విధంగా పరిగణనలోకి తీసుకోరాదని ఆయన అన్నారు. భారత్ బలమైన ప్రజాస్వామ్య దేశం అని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ నిరాశావాదం ప్రబలంగా ఉందన్న వాదనలను జైశంకర్ ఖండించారు.