బురదంటిన కాళ్ళ చప్పుడు
వినిపించగానే వరి మొలక
పులకించిపోతూ కదులుతుంది
నాట్లు మధ్యలో కలుపుకు
చరమగీతం పాడుతుంటే
పైరు పరవళ్ళు తొక్కుతుంది
స్వాతంత్య్రం వచ్చిన సంబరంలా
నిటారుగా నిలబడుతూ
నిర్భయంగా కదులుతుంది
సత్తువ కలిపిన ఎరువును
చిలకరిస్తూ వెళుతుంటే
మోసులెత్తిన పైరు మురిపెంగా
రైతు పాదాలను స్పర్శిస్తుంది
పైరు గాలికి సుతారంగా ఊగుతూ
వచ్చిపోయే బాటసారులను
మనసారా పలకరిస్తుంది
ప్రకృతి ఒడిలో ఒదిగిపోతూనే
బురద మట్టిలో అణువణువు
మిళితమవుతూ పరవశిస్తుంది
పల్చటి నీటిలో పైపై తేలిపోతూనే
హాయిగా ఉరకలేస్తుంది
రైతు పాడే రాగంలో ఓలలాడుతూ
తనివితీరా హర్షిస్తూ ఆనందిస్తుంది
గింజల్ని తన పొత్తిళ్ళలో దాచి
ఎంచక్కా కాపాడుకుంటుంది
తాను కోతకు బలైపోతూనే
గింజలకు జన్మనిస్తుంది
వరి గింజల కుప్ప
మరో గింజకు ప్రాణం పోస్తుంది
ఆహారంగా మారిపోతూనే
మనిషి జీవితానికి
ఆయువు పోసి బ్రతికిస్తుంది
నరెద్దుల రాజారెడ్డి