Saturday, February 22, 2025

మరో మహమ్మారి వ్యాధి… తస్మాత్ జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్)… లక్షమందిలో ఒకరిద్దరికి మాత్రమే సోకే ఒక వ్యాధి పేరు ఇది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాతోపాటు, దక్షిణాది రాష్ట్రాలను ఈ మహమ్మారి వణికిస్తోంది. పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. అంటువ్యాధి కానప్పటికీ, అరుదుగా సోకే వ్యాధే అయినప్పటికీ ఇది సోకితే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై, వ్యాధి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. కలుషితమైన నీరు, ఆహారం కారణంగా సోకే జిబిఎస్ సాధారణంగా పెద్దవారిపై మాత్రమే ప్రభావం చూపిస్తుంది.

అయితే ఇటీవల బయటపడిన కొన్ని కేసులలో పిల్లలకూ ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ కావడమే ఇప్పుడు కలవరం కలిగించే అంశం. ఢిల్లీలో వంద కేసులు వెలుగు చూడగా, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 60 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ఒకే రోజు 11 కేసులు వెలుగు చూడటం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. యాభై మంది జిబిఎస్ బారినపడ్డారనీ, వీరిలో ఇద్దరు మృతి చెందారని స్వయంగా ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యమంత్రి ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా తెలంగాణలోనూ జిబిఎస్ కాలు మోపినట్లు నిర్ధారణ అయింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక మహిళ జిబిఎస్ బారినపడి కన్నుమూయడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

ఉదర సంబంధిత వ్యాధులకు కారణమయ్యే కాంపైలోబాక్టర్ జెజునీ అనే బ్యాక్టీరియాయే గులియన్ బారీ సిండ్రో మ్‌కూ కారణమవుతోంది. వైద్య పరిభాషలో ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. కలుషిత నీరు, ఆహారంతో ఉదరంలోకి వ్యాధికారక బ్యాక్టీరియా ప్రవేశించి, తన ప్రతాపాన్ని చూపిస్తుంది. విరేచనాలు, కడుపు నొప్పి, నీరసంతో మొదలై, రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీయడం ఈ వ్యాధి ప్రత్యేకత. శరీరంలో ఉండే యాంటీబాడీలు సొంత కణజాలాలపైనే దాడి చేసి, నిర్వీర్యం చేస్తాయి. ఫలితంగా నాడీ వ్యవస్థ పనిచేయక, కండరాలు చచ్చుబడతాయి. సకాలంలో గుర్తించి చికిత్స పొందితే బతికి బయటపడే అవకాశం ఉన్నా, ఆలస్యం జరిగితే రోగిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.

బ్యాక్టీరియా, వైరల్ ఇన్ ఫెక్షన్ల కారణంగా రోగనిరోధక శక్తి క్షీణంచినవారికి జిబిఎస్ త్వరగా సోకుతుందన్న వైద్యుల హెచ్చరికలు నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. గులియన్ బారీ సిండ్రోమ్ ప్రబలడానికి కుంభమేళా కూడా ఒక కారణం కావచ్చునని ఆయా రాష్ట్రప్రభుత్వాలు అనుమానిస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉండటంతో నదీ జలాలు కలుషితమై జిబిఎస్ సోకుతోందన్న వైద్యనిపుణుల మాటలను కొట్టిపారేయలేం. మహారాష్ట్ర సరిహద్దుల్లో కర్ణాటకకు చెందిన రెండు గ్రామాల ప్రజలు ఈ వ్యాధికి గురికావడంతో ఆరా తీయగా ఇటీవల తీర్థయాత్రలకు వెళ్లివచ్చిన కొందరు గ్రామస్థులు జిబిఎస్ బారిన పడినట్లు తేలింది.

కాబట్టి ప్రయాగ్‌రాజ్ సహా, గంగానదీ తీర ప్రాంతాల్లో జలశుద్ధికి చర్యలు తీసుకోవడం తక్షణావసరం. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధి గురించి, వ్యాధి లక్షణాల గురించి అవగాహన కలిగించడం మరీ ముఖ్యం. లేనిపక్షంలో విరేచనాలు, నీరసమే కదాని సొంత వైద్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్లి స్వస్థలాలకు చేరుకున్నవారు తమలో ఈ వ్యాధి లక్షణాలు గమనిస్తే, తక్షణమే వైద్యులను సంప్రదించడం మేలు. జిబిఎస్‌కు చికిత్స ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం గమనార్హం.

ఈ వ్యాధికి వినియోగించే ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ల ఖరీదు 30 వేల రూపాయల పైమాటే. పైగా ఈ ఇంజెక్షన్లను రోజుకు మూడు చొప్పున ఇవ్వవలసి ఉంటుంది. పేద ప్రజానీకం ఇంతటి ఖర్చును భరించే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వాలు ముందుకు వచ్చి, ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మందులు, ఇంజెక్షన్లు నిల్వ ఉండేలా చూడాలి. మొక్కై వంగనిది మానై వంగదంటారు. ఇప్పుడిప్పుడే దేశమంతటా వ్యాపిస్తూ, తన ప్రతాపాన్ని చూపిస్తున్న ఈ మహమ్మారి వ్యాధి కోరలు పెరికివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కతాటిపైకి వచ్చి, యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే, కరోనా మాదిరిగా ఇది కూడా ప్రజల ప్రాణాలను పెద్ద సంఖ్యలో కబళించే ప్రమాదం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News