1/70 చట్టాన్ని రద్దు చేసి, గిరిజనుల హక్కులను హరించేందుకు మోడీ ప్రభుత్వ మద్దతుతో చంద్రబాబు నాయుడు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం సన్నద్ధమై, అందుకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఈ చట్టం వలన మన్యం ప్రాంత అభివృద్ధి చెందదని అసెంబ్లీ స్పీకర్ అయన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు అందులో భాగమే. ఈ ఆలోచన కూటమి ప్రభుత్వానికి కొత్తగా వచ్చింది కాదు. 1996 -2001 మధ్య ఈ చట్టాన్ని సవరించాలని ఆ నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు దగ్గర నుండి శాసన సభ కమిటీ నివేదిక దాకా అనేక ప్రయత్నాలు జరిగాయి.
దాని కొనసాగింపే అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు. అడవి, అటవీ భూముల సంపదలపై తరతరాలుగా వస్తున్న ఆదివాసీ గిరిజనుల హక్కులను హరించటానికి వలస పాలకుల నుంచి దేశీయ పాలకుల వరకు అనేక గిరిజన వ్యతిరేక చట్టాలు చేశారు. 1855లో భారత గవర్నర్ జనరల్‌గా బ్రిటిష్ ప్రభుత్వం పంపిన డల్హౌసీ తొలి గిరిజన వ్యతిరేక అటవీ విధానాన్ని ప్రకటించి, అటవీ సంపదలన్నీ ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించాడు. 1864 లో అటవీ ఇన్‌స్పెక్టర్ జనరల్ నియామకంతో అడవిపై బ్రిటిష్ ప్రభుత్వ పెత్తనం ప్రారంభమైంది. 1965లో మరో చట్టం ద్వారా పూర్తిగా అడవులను తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం హక్కు పొందింది.
అధికార మార్పిడి తర్వాత దేశీయ పాలకులు, వలస పాలకుల విధానాలనే కొనసాగించారు. 1952లో ప్రకటించిన అటవీ విధానం దాని కొనసాగింపే. ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం రిజర్వు, రక్షిత, గ్రామ అడవులుగా, అటవీ ప్రాంతాన్ని విభజించింది. ఫలితంగా అడవిపై గిరిజనుల హక్కు పరిమితమైంది. 1973లో ‘టైగర్ ప్రాజెక్టు’ పేరుతో గిరిజనులను అడవి నుండి వెల్ల గొట్టేందుకు పూనుకుంది. 1980లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గిరిజన వ్యతిరేక చట్టం అడవి నుండి గిరిజనులను ఖాళీ చేయించే చర్యలు తీసుకుంది. 2023లో మోడీ ప్రభుత్వం అటవీ హక్కుల సవరణ చట్ట ద్వారా అటవీ భూములను బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టే విధానాలు చేపట్టింది.
అడవిపై తరతరాలుగా ఉన్న హక్కును హరిస్తూ వలస పాలకులు, దేశీయ పాలకులు చేసిన చట్టాలకు వ్యతిరేకంగా గిరిజనులు అనేక పోరాటాలు చేశారు. 1802-03లో రంప తిరుగుబాటు, 1830లో బీహార్, బెంగాల్‌లో కోల్ తిరుగుబాటు, 1855- 56లో సంతాల్ గిరిజనుల తిరుగుబాటు, 1967లో నక్సల్‌బరీ గిరిజన రైతాంగ తిరుగుబాటు, 1968-70 వరకు సాగిన శ్రీకాకుళ గిరిజన మిలిటెంట్ ఉద్యమం ముఖ్యమైన గిరిజన పోరాటాలు. షెడ్యూల్ ఏరియా భూబదలాయింపు నిబంధనల 1959 చట్టం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 4, 1959లో అమల్లోకి వచ్చింది ఈ చట్టం వచ్చి 66 సంవత్సరాలు అయినా, అమలు మాత్రం జరగలేదు.
ఈ చట్టంలోనూ గిరిజనులకు నష్టం కలిగించే అంశాలు ఉన్నాయి. ఈ చట్టం గిరిజనుల భూములను, 1963 కంటే ముందు నుంచి స్థానికంగా ఉండి భూమి హక్కులు కలిగిన గిరిజనేతరుల భూములను కూడా కాపాడుతుంది. దీని ఫలితంగా గిరిజనులకు చెందాల్సిన భూములు గిరిజనేతురుల పరమవుతాయి. ఇది గిరిజన హక్కులను కాలరాయటమే.భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 244 (1) ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించిన వాటిల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలు కూడా ఉన్నాయి.
వీటిల్లో ఐదవ షెడ్యూల్ అమల్లో కూడా ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఈ చట్టం 1963లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం నియమాలను 1969లో రూపొందించారు. దీనికి కీలక సవరణలు 1970 జరిగాయి కనుక ఈ చట్టం 1/70గా ప్రాచుర్యంలో ఉంది. శ్రీకాకుళం గిరిజన ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల భూమి సమస్యను ముందుకు తెచ్చింది. గిరిజన పోరాటాలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చూసేందుకు ప్రభుత్వమే గిరిజనులకు భూములుఇచ్చి వారి హక్కులకు రక్షణ కల్పిస్తుందనే భ్రమలు కల్పించటానికి ఆనాటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ 1970లో 1/70 చట్టాన్ని చేసింది. ఈ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాల్లో భూమిపై పూర్తి హక్కు గ్రామసభలకు, పంచాయితీలకు, గిరిజన సలహా మండలికి ఉంటుంది.
గిరిజన ప్రాంతాల్లో సెంటు భూమి సేకరించాలన్నా గ్రామ సభ, పంచాయితీ తీర్మానం అవసరం. ఈ తీర్మానం గిరిజన సలహా మండలి పంపుతారు. 1/70 సెక్షన్ -3 ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని అన్ని అటవీ సంపదలు, భూములు కేవలం గిరిజనులకు గాని లేక గిరిజనులు మెంబర్లుగా ఉన్న సొసైటీకి మాత్రమే చెందుతాయి. అందుకు విరుద్ధంగా గిరిజనేతరులు భూములు పొందితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. ఒక గిరిజనేతరుడి నుంచి గిరిజనుడు లేదా గిరిజనులతో కూడిన సొసైటీ బదలాయింపు చేసుకోవచ్చు. ఏజన్సీ ప్రాంతంలో ఒక గిరిజనేతరుడికి భూమిపై హక్కు ఉంటే, తమ వారసులకు మాత్రమే భూబదలాయింపు చేయాలి.
1993లో గిరిజన భూముల అన్యాక్రాంతంపై జరిగిన ఒక సమావేశంలో షెడ్యూల్డ్ తెగలను ప్రస్తావిస్తూ, భారత రాజ్యాంగంలోని 5 షెడ్యూల్ ద్వారా ప్రత్యేకంగా రక్షించబడిన గిరిజన భూములను మైనింగ్ కంపెనీలు స్వాధీనం చేసుకున్నాయని గ్రామస్థులు ‘సమత’ అనే స్వచ్ఛంద సంస్థకు తెలిపారు. దీనిపై ఆ సంస్థ గిరిజనులను సమీకరించి న్యాయస్థానాలను ఆశ్రయించింది. భూములను ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు లీజుకి ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపై ఆ సంస్థ హైకోర్టులో కేసు వేయగా దాన్ని హైకోర్టు కొట్టివేసింది. సమత సంస్థ మళ్లీ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
1997 జులైలో సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తన తీర్పులో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు ప్రభుత్వ లేదా దాని సంస్థలు లీజుకి ఇచ్చిన భూములు చెల్లవని తీర్పుఇచ్చింది. ఇది సుప్రీం కోర్టు సమతా తీర్పుగా ప్రాచుర్యం పొందింది. పీసా చట్టం కూడా ప్రతి ఆదివాసీ సమూహానికి, తమ గ్రామ పరిధిలోని సహజ వనరులపై హక్కు గ్రామ సభలకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులు, వారి భూములపై హక్కుల అంశంపై అధ్యయనం చేయటానికి కమిటీని ఆనాటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నియమించింది.
ఆ కమిటీ నివేదికను 2005 ఆగస్టు 1న జెఎల్ గిర్ గిలానీ శాసనసభకు సమర్పించారు. అందులోని నిజాలు గిరిజనేతరులు కబళించిన భూ వివరాలు ఆశ్చర్యపర్చాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం చేసింది. ఈ చట్టం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 12 లక్షల ఎకరాల అటవీ భూములను పంపిణీ చేస్తానని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. అర్హత కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాల చొప్పున అటవీ భూములపై చట్టబద్ధత కల్పిస్తానని చెప్పారు. ఈ చట్టంలో ఉన్న అనేక కంతలు పెట్టి గిరిజనేతరులకు భూములు కాపాడుకునే అవకాశం కల్పించింది.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యక్తిగతంగా 2,87,648 మంది, ఉమ్మడిగా 3,161 మంది భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 70,952 మందిని గుర్తించి 1,13,870 ఎకరాలకు మాత్రమే పత్రాలు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. ఇప్పటికీ భూముల సర్వే పూర్తి చేయలేదు, గిరిజనులకు హక్కు పత్రాలు అందలేదు. ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు చట్టం అమలు గురించే మాట్లాడటం లేదు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలు అటవీ హక్కుల చట్టాన్ని పక్కన పెట్టాయి. 1996- 2001 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 1/70 చట్ట సవరణకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుండి శాసనసభ కమిటీల నివేదికల దాకా అనేక ప్రయత్నాలు జరిగాయి.
2000 సంవత్సరంలో చింతపల్లి బాక్సైట్ తవ్వకాల కోసం రస్ ఆల్ కైమా బహుళజాతి సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతించింది. వేలాది ఎకరాలు అప్పగించేందుకు సిద్ధమైంది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆదివాసీ ప్రజలు ఆందోళనలు చేయటం, ప్రజాసంఘాలు, ప్రజాతంత్రవాదులు వారికి మద్దతు ఇవ్వటం వల్ల చట్ట సవరణను, రస్ ఆల్ కైమాకు భూములు ఇచ్చే ప్రయత్నాలను చంద్రబాబుని వెనక్కి నెట్టేలా చేశాయి. గత చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే 1/70 చట్టాన్ని సవరించాలని అయ్యన్న పాత్రుడు ప్రకటించటం జరిగింది.
అందుకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలు ఉద్యమించటంతో, కూటమి ప్రభుత్వం వెడల గిరిజనుల్లో వ్యతిరేకతను గమనించి, ఆ ఉద్యమాన్ని విరమించేలా చేయటానికి 1/70 చట్టాన్ని రద్దు చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇది మోసపూరిత ప్రకటనే. రద్దు అనే కత్తి చట్టంపై వేలాడుతూనే ఉంది. ఎప్పుడైనా తెగిపడ వచ్చు. గిరిజనులు అప్రమత్తత కలిగి ఉండాలి. కూటమి ప్రభుత్వ మోసాలను గమనించి 1/70 చట్టాన్ని సవరించే దాని చర్యలకు వ్యతిరేకిస్తూ, చట్టంలో ఉన్న లొసుగులను తొలగించాలని, అటవీ హక్కుల సవరణ చట్టాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేయాలని అన్ని వర్గాల గిరిజన ప్రజలు ఉద్యమించాలి.
– బొల్లిముంత సాంబశివరావు