వాషింగ్టన్ : రష్యాతో యుద్ధానికి ఉక్రెయినే అసలు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. దండయాత్ర మొదలు కాకముందే రష్యాతో ఒప్పందం చేసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆయన ఫ్లోరియా లోని తన భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా సౌదీలో మొదలైన శాంతి చర్చల్లో కీవ్‌ను భాగం చేయకపోవడంపై వస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. యుద్ధాన్ని ముగించే శక్తి నాకుందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అంతా సజావుగానే జరుగుతోంది.
‘మంచిది… మమ్మల్ని ఆహ్వానించలేదు ’ అన్న వ్యాఖ్యలను నేను విన్నాను. సరే.. నువ్వు అక్కడ మూడేళ్ల నుంచి ఉన్నావు. నువ్వే ఈ మూడేళ్లలో యుద్ధాన్ని ముగించాల్సింది. అసలు నువ్వు దీనిని మొదలు పెట్టి ఉండాల్సింది కాదు. మేరే ఓ డీల్ చేసుకొని ఉండొచ్చు. నేను ఉక్రెయిన్ కోసం ఓ ఒప్పందం కుదర్చగలను. అది పోగొట్టుకున్న దాదాపు మొత్తం భూమిని తిరిగి ఇప్పించగలను. ప్రజలు ఎవరూ చనిపోరు. ఏ నగరం నేలమట్టం కావాల్సిన అవసరం రాదు. ఒక్క ఇంటి పైకప్పు కూడా కూలదు. కానీ వారు అలా జరగకూడదనుకున్నారు.
” అని ట్రంప్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఉద్దేశించి అన్నారు. అతడి నేతృత్వం లో ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు. అసలు ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని జెలెన్‌స్కీకి కేవలం 4 శాతం మాత్రమే ప్రజా మద్దతు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరులో తాను పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. రష్యా ఈ వినాశనం ఆపడానికి ఏదో చేద్దామనుకుంటోందని అభిప్రాయపడ్డారు. ప్రతివారం వేల మంది సైనికులు చనిపోతున్నారని గుర్తు చేశారు. తాము దీనిని ముగించాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇది బుద్ధి తక్కువ యుద్ధమని ట్రంప్ అభివర్ణించారు.
ఉక్రెయిన్‌ను పక్కకు తప్పించలేదు..
సౌదీలో మొదలైన శాంతి చర్చలపై ఇటీవల జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ను పక్కన పెట్టారన్న ప్రచారాన్ని కొట్టి పారేశారు. దానితో సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. ఎవరినీ పక్కన పెట్టం. ఉక్రెయిన్‌తోపాటు ఐరోపా భాగస్వాములు, ఇతరులతోను చర్చలు జరుపుతాము” అని పేర్కొన్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ రియాద్‌లో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ నాటోలో చేరే అంశంపై మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమన్నారు. అది తమ దేశ భద్రతకు ముప్పుగా మారుతుందన్నారు. నాటో సభ్యదేశ సైన్యాలైనా, లేదా ఐరోపా సమాఖ్య కింద వచ్చే సేనలైనా, దేశాల పతాకాలతో వచ్చే దళాలైనా సరే ఉక్రెయిన్‌లో మోహరించడాన్ని ఏమాత్రం ఆమోదించబోం ” అని ఆయన తేల్చి చెప్పారు.