Saturday, February 22, 2025

చట్టబద్ధమైన ‘దత్తత’తో ఊరట

- Advertisement -
- Advertisement -

అనాథలకు ‘దత్తత’ ఓ వరం. తెగిన గాలిపటంలా పయనిస్తున్న జీవితానికి ఆసరా దొరకడం పునర్జన్మగా భావించాలి. పెంచే తల్లిదండ్రులను పొందే అవకాశం కలగడం పిల్లలకు అంతకంటే కావల్సిందేముంటుంది. అలాగే పిల్లల కోసం తపించే తల్లిదండ్రులకు అదొక కల. సంవత్సరాలుగా వేధిస్తున్న సంతానలేమి, అమ్మ పిలుపుకోసం ఆరాటం వెరసి కుటుంబ సంరక్షణలో లేని అనాథలకు కొత్తజీవితం అందివస్తుంది. అయితే ఈ దత్తత పెద్ద ప్రహసనంగా మారింది. దత్తత ప్రక్రియకు కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ (సిఎఆర్‌ఎ కారా) పర్యవేక్షణలో నడుస్తోంది. వీటి నియమ నిబంధనలు చాలా మంది దంపతులకు ఆటంకంగా మారాయి.

నిబంధనలు పాటించకుండా చిన్నారులను దత్తత పొందడం నేరం చేయడమవుతుంది. తల్లిదండ్రుల్లేని, సంరక్షణ కొరవడిన చిన్నారులను దత్తత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిబంధనలు సులభతరం చేసింది. దత్తతకు ఎంపికకాని చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు పరిమితమవుతున్నారు. దేశీయంగా గుర్తింపు పొందిన సంరక్షణ కేంద్రాల్లో సుమారు 66 వేల మంది పిల్లలు ఉన్నారు. అనాథ పిల్లలు, తప్పిపోయిన వారిని వెంటనే దత్తత ఇవ్వడానికి వీల్లేదు. ఆ పిల్లల అసలు తల్లిదండ్రుల కోసం వెతికి వారు దొరకనప్పుడు మాత్రమే దత్తతకు అర్హులవుతారు. దత్తత ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి కావాలి. కానీ, అధికారుల అలసత్వం వల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. ఒక్కోసారి మూడు నాలుగేళ్ల కాలం పడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3,010 మంది పిల్లలను దేశీయంగా, 431 మందిని విదేశీయులకు దత్తత కల్పించారు. గత అక్టోబరు నాటికి, మన దేశంలో 2,146 మంది పిల్లల దత్తతకు అనుమతి ఉంది. మరో 30 వేల మందికి పైగా దత్తత కోసం ఎదురు చూస్తున్నారు.

దేశవ్యాప్తంగా చూస్తే తెలంగాణ నుంచి దత్తత సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గడిచిన రెండేళ్లలో దేశీయ దత్తతలో తెలంగాణ రాష్ర్టం ఏడవ స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే విదేశీయులు తీసుకునే దత్తతలో రెండేళ్లుగా తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. వివిధ రాష్ట్రాలు, విదేశాలకు చెందిన దంపతులు దత్తత తీసుకున్న చిన్నారుల యోగక్షేమాలను శిశు సంక్షేమ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. హిందూ దత్తత చట్టం 1956 ప్రకారం హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు దత్తత తీసుకోవచ్చు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా దత్తత ప్రక్రియ పూర్తిచేసి, అనంతరం కోర్టు ద్వారా ఆమోదం పొందవచ్చు. ఇలాంటి దత్తతలో ప్రభుత్వ నిఘా ఉండదు. సాధారణంగా బంధువులు లేదా స్నేహితుల పిల్లలను ఈ పద్ధతిలో దత్తత తీసుకుంటారు.

జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, భద్రత) చట్టం 2015 దత్తతకు సంబంధించిన విషయాలను మరింత వివరంగా తెలియజేసింది. అన్ని మతాలకు వర్తించేలా రూపొందించిన ఈ చట్టం ప్రకారం కేంద్రం ఏర్పాటు చేసిన కేంద్ర దత్తత వనరుల ప్రాధికార సంస్థ (కారా) నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. తాజాగా సులభతరం చేసిన నిబంధనల ప్రకారం రాష్ర్టంలో తల్లిదండ్రుల్లేని, సంరక్షణ కొరవడిన ఆరేళ్లకు పైబడిన చిన్నారులను దత్తత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సులభతరం చేసింది. ఆరేళ్ల వయసులోపు చిన్నారులు సంరక్షణ కేంద్రాలకు పరిమితమవుతారు. ఆరేళ్ల వయసు దాటిన చిన్నారులు సంరక్షణ కేంద్రాల నుంచి బయటకువచ్చి కుటుంబ వాతావరణంలో పెరిగేందుకు వీలుగా నూతన మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చాయి. రెండేళ్ల పాటు తాత్కాలిక సంరక్షణ కల్పించిన కుటుంబాలు, దంపతులు ముందుకు వస్తే వారికే పిల్లలను దత్తతకు ఇచ్చేలా ‘ఆదర్శ ఫాస్టర్‌కేర్ నిబంధనలు 2024’ను రూపొందించింది. ఫాస్టర్‌కేర్ కోసం ముందుకు వచ్చే దంపతులు, కుటుంబాలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అర్హులై ఉండాలి. ఆరేళ్ల నుంచి పన్నెండేళ్లలోపు చిన్నారులను సంరక్షణలోకి తీసుకోవాలనుకున్న దంపతులిద్దరి వయసు కలిపితే 70 ఏళ్ల నుంచి 110 ఏళ్ల మధ్య ఉండాలి.

సింగిల్ పేరెంట్ అయితే 35 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 12 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులను దత్తత తీసుకోవాలనుకున్నా ఇవే వయో నిబంధనలు వర్తిస్తాయి. సింగిల్ పేరెంట్ పురుషుడు ఉన్నట్లయితే ఆడపిల్లను తాత్కాలిక సంరక్షణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. తాత్కాలిక సంరక్షణ సమయంలో పిల్లలపై వివక్ష చూపినా, సంరక్షణ సరిగా లేకున్నా ఆ దత్తతను రద్దు చేస్తారు. ప్రతి ఏటా సమీక్షించి సంతృప్తికరంగా ఉంటే 18 ఏళ్ల వరకు పొడిగిస్తారు. తాత్కాలిక సంరక్షణ పూర్తయిన తర్వాత శాశ్వత దత్తత కోరుకుంటే నిబంధనల ప్రకారం అనుమతినిస్తారు. సంతాన లేమి సమస్య కారణంగా దత్తతకు డిమాండ్ పెరుగుతోంది. చిన్నారులు తక్కువగా ఉండడం, దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఇక దత్తత తీసుకుంటున్న దంపతుల్లో ఎక్కువ శాతం మంది ఆడపిల్లలను కోరుకుంటున్నారు.

మగపిల్లల కన్నా ఆడపిల్లలే ముద్దు అని, వారు ఉంటే ఇల్లంతా పండగే అని, చివరి క్షణాల్లో ప్రేమగా చూసుకునేది ఆడపిల్లలేనని విశ్వసిస్తున్నారు. అందుకే రాష్ర్టం నుంచి జరుగుతున్న దత్తత ప్రక్రియలో ఆడపిల్లల సంఖ్యనే ఎక్కువగా ఉంటోంది. నాలుగేళ్లలో 798 మంది చిన్నారులు మన దేశంతో పాటు విదేశాలకు దత్తతకు వెళ్తే, అందులో 527 మంది ఆడపిల్లలే. ఎక్కువ కాలం వేచి ఉండలేని కొంతమంది అక్రమ మార్గాల్లో ‘దత్తత’ పేరుతో క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. కారా నిబంధనల మేరకు దత్తత పొందకుండా ఇతర మార్గాల్లో బిడ్డను దక్కించుకుంటే చిక్కులు తప్పవు. కొన్నేళ్లపాటు మమకారంతో పెంచుకున్న ఆ బిడ్డ వారికి కాకుండాపోతుంది. ఢిల్లీ, పుణెలతో పాటు పలు రాష్ట్రాల నుంచి చిన్న పిల్లలను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాలు జరిపారు.

ఇది తప్పా ఒప్పా అని ఆలోచించని ఎంతో మంది మధ్యతరగతికి చెందిన దంపతులు మమకారంతో బిడ్డలను కొనుగోలు చేశారు. కొందరైతే ఏళ్ల తరబడి సొంత బిడ్డకన్నా ఎక్కువగా పెంచుకుంటూ, వారిపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. స్టింగ్ ఆపరేషన్‌లో పిల్లల అక్రమ రవాణా గుట్టురట్టు కాగానే చట్టబద్ధంగా దత్తత పొందని పిల్లలను గుర్తించారు. ఆ బిడ్డలను అదుపులోకి తీసుకొని శిశుసంక్షేమ గృహాలకు తరలించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దత్తత ప్రక్రియలో సంక్లిష్టతలు ఉన్నప్పటికీ, వీటిని అధిగమించి నిబంధనల మేరకు పిల్లలను దత్తత తీసుకోవడం ఉత్తమమైన మార్గం. పిల్లలను అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరం. పిల్లలను కొనుగోలు చేసిన దంపతులపై కూడా సిఆర్‌పిసి, జువెనైల్ జస్టిస్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు. పిల్లలను అంగట్లో సరుకుల్లా అమ్ముతున్న ముఠాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి.

కోడం పవన్‌కుమార్ 9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News