వాషింగ్టన్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే జెలెన్‌స్కీని నియంతగా అభివర్ణించిన ట్రంప్ తాజాగా ఆయనను కమెడియన్‌గా సంబోధించారు. ఆ కమెడియన్ అమెరికాతో ఏకంగా 35 వేల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టించారని ట్రంప్ మండిపడ్డారు. ఈ మేరకు జెలెన్‌స్కీని ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రష్యాతో మూడు సంవత్సరాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చర్చలు జరుపుతారని ఉక్రెయిన్ భావిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ తీరును జెలెన్‌స్కీ జీర్ణించుకోలేకపోతున్నారు.
అమెరికా చుట్టూ అబద్ధాలు, తప్పుడు సమాచారమే ఉందని ఇటీవల జెలెన్‌స్కీ వాపోయారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కోసం తాము పోరాడుతున్నామని, తమ భూభాగంపై రష్యా దురాక్రమణను అడ్డుకుంటున్నామని జెలెన్‌స్కీ చెప్పారు. అయితే, ట్రంప్ మాత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాటలను విశ్వసిస్తూ తమ ఆవేదనను అర్థం చేసుకోవడం లేదని జెలెన్‌స్కీ అన్నారు. బైడెన్ హయాంలో అమెరికా తమకు అందజేసిన సాయాన్ని ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత నిలిపివేశారని ఆయన ఆరోపించారు.
అమెరికా సాయం లేకుంటే ఉక్రెయినియన్లు ఎక్కువ రోజులు మనుగడ సాగించలేరని ఆయన అన్నారు. కాగా, రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఎలా అయినా ముగించాలన్న లక్షంతో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ దూత లెఫ్టినెంట్ కీత్ కెల్లాగ్ గురువారం భేటీ అయ్యారు. ఆ భేటీ తరువాత మీడియా సమావేశంలో నేతలు ఇద్దరూ మాట్లాడవలసి ఉండగా, దానిని రద్దు చేశారు. అమెరికా విజ్ఞప్తి చేయడంతో మీడియా సమావేశాన్ని రద్దు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలియజేశారు.