న్యూఢిల్లీ : భారతీయ మనస్తత్వంతోనే అయినా ప్రపంచ దృక్పథం గల నేతల అవసరం వివిధ రంగాల్లో దేశానికి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉద్ఘాటించారు. ఢిల్లీలో అంతిమ నాయకత్వ శిక్షణ సంస్థ (ఎస్‌ఎల్‌యు) సమ్మేళనంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, ‘భారతీయ దృష్టితో అంతర్జాతీయ మనస్తత్వంపై అవగాహనతో ముందుకు సాగే వ్యక్తుల అవసరం మనకు ఉంది’ అని చెప్పారు. ‘ప్రపంచ భావన. స్థానిక పెంపకం’ ఉన్న వివిధ రంగాల్లో నాయకుల ఆవశ్యకత ఉందని ప్రధాని ఉద్ఘాటిస్తూ, అధికార యంత్రాంగంలోనైనా, వాణిజ్య రంగంలో లేదా ఏదైనా రంగంలో భారత జాతీయ లక్షాన్ని ప్రతిబింబించే నాయకత్వం కావాలని అన్నారు.
ప్రపంచ వేదికపై దేశ ప్రయోజనాలను ప్రోత్సహిస్తూనే ప్రపంచ సంక్లిష్టత, అవసరాలకు పరిష్కారం కనుగొనగల నాయకత్వం ప్రతి రంగంలో కావాలని మోడీ సూచించారు. భారత్ ప్రపంచ శక్తిగా ఆవిర్భిస్తోందని, ఈ ఊపును వేగవంతం చేసే, ప్రతి రంగంలో అటువంటి విజయాలు నమోదు చేసే ప్రపంచ శ్రేణి నేతల ఆవశ్యకత ఉందని ప్రధాని అన్నారు. ఎస్‌యుఎల్ వంటి సంస్థ అటువంటి మార్పు తీసుకురాగలదని ఆయన అన్నారు.
వివిధ రంగాల్లో విజయాలను సాధ్యం చేయగల మానవ వనరుల పాత్ర గురించి మోడీ ప్రధానంగా ప్రస్తావిస్తూ, సృజనకు సారథ్యం వహించగల, నైపుణ్యాలను ఉపయోగించుకోగల నాయకులు దేశంలో ఉండాలని సూచించారు. మోడీ ఈ సందర్భంగా గుజరాత్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. సహజ వనరుల కొరత కారణంగా ప్రత్యేక రాష్ట్రంగా గుజరాత్ భవిష్యత్ గురించి ప్రశ్నలు లేవనెత్తారని ఆయన గుర్తు చేశారు. అయితే, గుజరాత్ తమ నేతల కారణంగా సత్ఫలితాలు సాధిస్తోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వజ్రాల గని లేదని, కానీ ప్రపంచంలోని పది వజ్రాల్లో తొమ్మిడి గుజరాతీ చేతుల్లో నుంచే వెళుతున్నాయని మోడీ చెప్పారు.