న్యూఢిల్లీ : ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బిజెపి ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలో మహిళలకు నెల నెలా రూ. 2500 భృతి పథకాన్ని ఆమోదిస్తామన్న ఎన్నికల ముందరి వాగ్దానాన్ని నెరవేర్చలేదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నాయకురాలు ఆతిశీ విమర్శించారు. బిజెపి ‘ఢిల్లీ మహిళలను మోసగించింది’ అని ఆతిశీ ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాజీ సిఎంపై ఎదురుదాడి చేశారు. కొత్త ప్రభుత్వం ఏమి చేయాలో ఉపన్యాసం ఇవ్వవద్దని, మీ సంగతి చూసుకోండని ఆతిశీని సిఎం కోరారు. ‘ఇది మా ప్రభుత్వం, అజెండా మాదే.
మమ్మల్ని పని చేయనివ్వండి. ఆమె ప్రతి విషయమూ మాకు సూచించవలసిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె చేయవలసిందేదో ఆమె చేసింది’ అని రేఖా గుప్తా సమావేశం అనంతరం విలేకరులతో చెప్పారు. ఆతిశీపై ఢిల్లీ సిఎం మరింతగా విరుచుకుపడుతూ, ‘కాంగ్రెస్ 15 ఏళ్ల పాటు పాలించింది, ఆప్ 13 ఏళ్లు పాలించింది. తాము చేసింది ఏమిటో చూసుకోవలసింది పోయి మా పాలన మొదటి రోజే ప్రశ్నలను ఎలా లేవనెత్తుతారు?’ అని అన్నారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను బిజెపి గుర్తు పెట్టుకుంటుండడమే ఆప్‌కు ప్రధాన సమస్య అని రేఖా గుప్తా విమర్శించారు.
అర్వింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్‌లను తమ తమ పార్టీలపై దృష్టి కేంద్రీకరించుకోవాలని ఆమె కోరారు. ‘పార్టీలను వీడాలని కోరుకుంటున్నవారు అనేక మంది ఉన్నారు’ అని ఆమె చెప్పారు. ‘మేము ఇప్పుడు ఢిల్లీ గురించి ఆలోచిస్తాం. ప్రధాని మోడీ సారథ్యంలో ఢిల్లీ తన హక్కులు పొందుతుంది’ అని రేఖా గుప్తా చెప్పారు. ‘ఏళ్ల తరబడి పాలించిన వారు వీరే. వీరి హయాంలో అవినీతి ఘటనలు అనేకం వెలుగు చూశాయి. అసెంబీ సెషన్ తొలి రోజు కాగ్ నివేదికను సమర్పిస్తారని, పలువురి రహస్యాలు బహిర్గతం అవుతాయని వీరు భయపడుతున్నారు’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి విలేకరులతో చెప్పారు.
బిజెపి ప్రభుత్వం ఢిల్లీలో గురువారం నిర్వహించిన తొలి క్యాబినెట్ సమావేశంలో తమ ఎన్నికల పూర్వపు కీలక వాగ్దానమైన కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని రాజధానిలో అమలు పరుస్తామని వెల్లడించింది. రేఖా గుప్తా ఆతరువాత విలేకరులతో మాట్లాడుతూ, పూర్వపు ఆప్ ప్రభుత్వ పని తీరుపై 14 కాగ్ నివేదికలను తమ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని తెలియజేశారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అధికారంలో ఉన్నప్పుడు వాటిని అసెంబ్లీకి సమర్పించలేదు.