వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం, పోలేపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు కొనసాగే ఈ బ్రహ్మోత్సవాలలో ప్రముఖమైన సిడె కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు నియోజకవర్గ ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో జాతరకు హాజరవుతారు. ఈ ప్రాంతంలో మినీ మేడారంగా ప్రసిద్ధి పొందిన పోలేపల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ అర్చకులు, ఆలయ ఇఒ రాజేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ ఛైర్మన్ జయరాములు సిఎంకు, పలువురు మంత్రులకు అమ్మవారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి భక్తులకు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. సిఎం వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గురునాథ్‌రెడ్డి, పరిగి, చేవెళ్ల, తాండూర్ ఎంఎల్‌ఎలు రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, మనోహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఐజి సత్యనారాయణ, జిల్లా ఎస్‌పి నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, మాజీ ఎంఎల్‌ఎ గురునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.