లక్నో :అమెరికాలో విలేకరుల సమావేశంలో అదానీ గురించి అడిగిన ప్రశ్నకు ప్రధాని మోడీ ఇచ్చిన సమాధానాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తప్పుపట్టారు. “ నరేంద్రమోడీజీ.. అది వ్యక్తిగత అంశం కాదు. అది దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయం. ” అని రాహుల్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ విమర్శించారు. ఇటీవల ప్రధాని మోడీ అగ్రరాజ్యంలో పర్యటించిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూపుపై అమెరికాలో పెట్టిన కేసు గురించి ట్రంప్ తో భేటీ సమయంలో చర్చకు వచ్చిందా ? అని మీడియా సమావేశంలో మోడీకి ప్రశ్న ఎదురైంది. “ భారత్ ఓ ప్రజాస్వామ్య దేశం. వసుధైక కుటుంబం అనేది మా సంస్కృతి.
ప్రపంచం మొత్తం మా కుటుంబం అనుకుంటాం. ప్రతి భారతీయుడిని మావాడి గానే భావిస్తాం. ఇద్దరు దేశాధినేతలు ఎప్పుడూ వ్యక్తిగత స్థాయి అంశాలను చర్చించరు” అని ప్రధాని వెల్లడించారు. ఈ సమాచారాన్ని రాహుల్ గతం లోనూ విమర్శించారు. ఈ విషయం గురించి దేశంలో ఎవరైనా ప్రశ్నిస్తే మౌనం దాల్చే ప్రధాన మంత్రి అదే ప్రశ్నను విదేశాల్లో ఎవరైనా అడిగితే
అది వ్యక్తిగత విషయమని బదులిస్తారు ” అని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
ఇది వైఫల్య ప్రభుత్వం
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిన సర్కారు అని లోక్‌సభలో విపక్ష నేత , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బిజెపి సర్కారును గద్దెదించి కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారం లోకి తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన పార్టీశ్రేణుల సమావేశంలో శుక్రవారం మాట్లాడారు. తాము అధికారం లోకి వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని , ప్రజాసంక్షేమానికి పాటుపడతామని చెప్పారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. పైగా ఈ ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలు, బ్యాంకులను ప్రైవేట్ పరం చేసిందని మండిపడ్డారు. కేంద్రం తీరుతో డిగ్రీకి విలువ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో యువతకు ఉద్యోగం రావాలన్నా, పేద, మధ్యతరగతి ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకురావాలన్నారు.