ప్రతిష్ఠాత్మకమైన దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో విదర్భ టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్లో విదర్భ 80 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైని ఓడించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. విదర్భ అసాధారణ ఆటతో బలమైన ముంబైని మట్టి కరిపించింది. ఇదే క్రమంలో కిందటి సారి ఫైనల్లో ముంబై చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. 405 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లు సమష్టిగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చారు.
ముంబై విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (39), షమ్స్ ములాని (46), శార్దూల్ ఠాకూర్ (66), మొహిత్ అవస్థి (34) తప్ప మిగతా విఫలమయ్యారు. దీంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఇక ప్రత్యర్థి టీమ్ బౌలర్లలో హర్ష్ దూబె ఐదు, యశ్ ఠాకూర్, పార్థ్ రెఖాడె రెండేసి వికెట్లను పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 383, రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులు చేసింది. ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులకు ఆలౌటైంది. ఇక ఫైనల్లో విదర్భ టీమ్ కేరళతో తలపడుతుంది. గుజరాత్‌తో జరిగిన మరో సెమీస్‌లో కేరళ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.