మన తెలంగాణ/క్రీడా విభాగం: టీమిండియాలో మహ్మద్ షమిది ప్రత్యేక స్థానం. జహీర్ ఖాన్ తర్వాత ఆ స్థాయి బౌలర్ షమినే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు గాయాలు, మరోవైపు వ్యక్తిగత సమస్యలు వెంటాడినా షమి మాత్రం వెనుదిరిగి చూడలేదు. బరిలోకి దిగిన ప్రతిసారి జట్టును ముందుండి గెలిపించడంలో ఆరితేరాడు. తాజాగా పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టి తనలో చేవ తగ్గలేదని నిరూపించాడు. ఐసిసి ట్రోఫీల్లో షమికి కళ్లు చెదిరే రికార్డు ఉంది. ఆడిన ప్రతి ఐసిసి టోర్నమెంట్‌లోనూ వికెట్ల పంట పండించడం అలవాటుగా మార్చుకున్నాడు. కిందటి వన్డే ప్రపంచకప్‌లో షమి అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ వరల్డ్‌కప్‌లోనే అత్యధిక వికెట్లను పడగొట్టిన బౌలర్‌గా షమి నిలిచాడు. అయితే వరల్డ్‌కప్ తర్వాత షమి గాయానికి గురయ్యాడు. కాలికి శస్త్ర చికిత్స జరగడంతో దాదాపు ఏడాదికి పైగా ఆటకు దూరం కావాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉండడంతో షమి మళ్లీ పూర్వవైభవం సాధించడం చాలా కష్టంతో కూడుకున్న అంశమని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు జోస్యం చెప్పారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ షమి మళ్లీ గాడిలో పడ్డాడు. తొలుత దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటాడు. రంజీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ రాణించాడు. రంజీల్లో రాణించడంతో షమికి టీమిండియాలో చోటు దక్కింది. టి20లలో షమికి ఎక్కువ ఛాన్స్‌లు రాలేదు. అయితే వన్డే సిరీస్‌లోఎక్కువ అవకాశాలు లభించాయి. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.
బుమ్రాలేని లోటును పూడ్చాడు..
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. గాయంతో భారత ప్రధాన అస్త్రం, స్పీడ్‌స్టర్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దీంతో బౌలింగ్ బలహీనంగా కానిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు ఆశలన్నీ షమిపైనే నిలిచాయి. షమి కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేగాక బుమ్రా లేని లోటు కనిపించకుండా చేశాడు. రానున్న మ్యాచుల్లో కూడా షమి నుంచి ఇలాంటి ప్రదర్శనే జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. షమి కూడా మెరుగైన బౌలింగ్‌తో జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో ఉన్నాడు.