చెన్నై: నేషనల్ ఎడ్యూకేషనల్ పాలసీ (ఎన్‌ఇపి) పేరుతో హిందీ భాషను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని దాని తిరస్కరించినందుకు తమ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు అంటూ తమిళనాడు ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. స్టాలిన్ ఎన్ఇపిపై ముందు చూపు లేకుండా మాట్లాడుతున్నారు అని అన్నారు.
అయితే ఈ అంశంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నిది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. తమిళ ప్రజలకు ఏ భాష కావాలో తెలుసు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మక్కల్ నిది మయ్యం పార్టీ స్థాపించి ఎనిమిది నెలలు గడిచిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తమిళ ప్రజలు తమ భాష కోసం ప్రాణాలు వదిలారు. అలాంటి భాషతో ఆటలు ఆడకండి. తమిళ ప్రజల్లో.. చిన్న పిల్లలతో సహా ఏ భాషను ఎంచుకోవాలో వారికి తెలుసు’’ అని అన్నారు.