ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనున్న భారత్, పాక్
దుబాయ్‌లో సమరం
దుబాయి: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగే కీలక సమరంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. దుబాయి వేదికగా ఈ హై ఓల్టెజ్ పోరు జరుగనుంది. పాకిస్థాన్ ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై ఆత్మరక్షణలో పడింది. ఇక బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన టీమిండియా ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు ఇరు జట్లకు అందుబాటులో ఉన్నారు. దీంతో దాయాదిల సమరం అభిమానులను కనువిందు చేయడం ఖాయం.
గిల్ జోరు సాగాలి..
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి పోరులో అజేయ శతకంతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి కూడా గిల్ బ్యాట్‌తో మెరుపులు మెరిపించాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. గిల్ కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలనే లక్షంతో ఉన్నాడు. కొంతకాలంగా గిల్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన గిల్ తనదైన శైలీలో చెలరేగి పోతే టీమిండియాకు ఈసారి కూడా శుభారంభం ఖాయం. ఇక కిందటి మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచిన రోహిత్ శర్మ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు.
కానీ చిరకాల ప్రత్యర్థితో జరిగే పోరులో మాత్రం చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాలనే లక్షంతో ఉన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కెప్టెన్ రోహిత్ జట్టుకు చాలా కీలకమని చెప్పాలి. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లు ఈసారైనా తమ బ్యాట్‌లకు పని చెప్పాల్సి ఉంది. శ్రేయస్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. అక్షర్ కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలి. బ్యాట్‌తోనూ మెరువాల్సిన అవసరం ఉంది.
కోహ్లి ఈసారైనా..
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లోనైనా మెరుగ్గా ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. బంగ్లాదేశ్ పోరులో కోహ్లి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోయాడు. కీలకమైన దాయాది సమరంలోనైనా కోహ్లి మెరుపులు మెరపాల్సి ఉంది. బంగ్లా మ్యాచ్‌లో కోహ్లి డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. అతని బ్యాటింగ్ నత్త ను తలపించింది. ఇప్పటికైనా విరాట్ తన బ్యాటింగ్ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తొలి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న వికెట్ కీపర్ కెఎల్ రాహుల్‌పై ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రాహుల్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాడు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన స్పీడ్‌స్టర్ మహ్మద్ షమి మరోసారి మెరుగైన ప్రదర్శన చేసేందుకు తహతహలాడుతున్నాడు. పాక్‌పై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. షమి విజృంభిస్తే పాక్ బ్యాటర్లకు కష్టాలు ఖాయం. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, కుల్దీప్, జడేజా, హార్దిక్ తదితరులతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. రెండు విభాగాల్లోనూ బలంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
పాక్‌కు పరీక్షలాంటిదే..
భారత్‌తో జరిగే పోరు పాకిస్థాన్‌కు పరీక్షగా మారింది. సెమీస్ రేసులో నిలువాలంటే ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి జట్టుకు ఏర్పడింది. కిందటి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేయలేక పోయింది. ఈ మ్యాచ్‌లోనైనా వీటిని మెరుగు పరుచుకోక తప్పదు. అప్పుడే భారత్‌పై గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.