Sunday, February 23, 2025

కొత్త రాజకీయ శకంవైపు జర్మనీ

- Advertisement -
- Advertisement -

కొత్త రాజకీయ శకానికి నాంది పలకడానికి దాదాపు 60 మిలియన్ జర్మన్లు ఆదివారం (ఫిబ్రవరి 23) ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 27 దేశాలతో కూడిన యూరప్ యూనియన్‌లో అత్యంత బలోపేతమైన దేశం జర్మనీయే నాటోకు నాయకత్వం వహిస్తోంది. రష్యాతో యుద్ధం సాగిస్తోన్న ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసే ప్రధాన దేశాల్లో జర్మనీ రెండోది. మొత్తం 84 మిలియన్ జనాభా కలిగిన జర్మనీలో 59.2 మిలియన్ మంది ఓటర్లు ఉన్నారు. ఇంత ప్రాధాన్యం కలిగిన జర్మనీలో కొత్త రాజకీయ పరిణామాలు ఏర్పడనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిత్రదేశాలు జర్మనీ అంతర్జాతీయ పాత్రలో ఓటు విలువ ఏమిటో నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంతోపాటు అక్రమ వలసలతో సతమతమవుతున్న జర్మనీలో ఈసారి ఎన్నికలు ఆయా పార్టీలకు అగ్నిపరీక్ష కానున్నాయి. 2010 దశకంలో జర్మనీలోకి వలసలు పోటెత్తడం రానురాను తీవ్ర సమస్యగా పరిణమించింది. దీంతో అక్రమ వలసలను అరికట్టడంతోపాటు శరణార్ధుల గుర్తింపు నిబంధనలు కఠినతరం చేయాలన్న డిమాండ్లు తెరముందుకు వస్తున్నాయి.

గత ఏడాది నవంబరు 6న జర్మనీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి మైనారిటీ ప్రభుత్వానికి జర్మనీ ఛాన్స్‌లర్ ఓలాఫ్ షోల్జ్ నాయకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ పార్లమెంట్ విశ్వాసం కోల్పోయిన సంగతి తెలిసిందే. 733 మంది సభ్యులున్న సభలో ఆనాడు ఓటింగ్ జరగ్గా, ఆయనకు అనుకూలంగా కేవలం 207 ఓట్లే వచ్చాయి. వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు. 116 మంది గైర్హాజరయ్యారు. మెజారిటీకి 367 కావలసి ఉంది. నిర్ణీత సమయం కంటే ఏడు నెలల ముందుగా అంటే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపడానికి ప్రధాన పార్టీలన్నీ అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 23) జర్మనీలో ఎన్నికలు జరపడానికి అంతా సిద్ధమైంది.

ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తయారయ్యాయి. ఈసారి క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సిడియు) అధినేత ఫ్రిడిష్ మెర్జ్, సోషల్ డెమొక్రాటిక్ పార్టీ నేత, మాజీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఎఎఫ్‌డి పార్టీ నాయకురాలు ఎలీస్ వీడెల్, ది గ్రీన్స్/ అలయన్స్ 90 పార్టీ సారథి రాబర్ట్ హబెక్, ది సారా వాగెన్ కనెక్ట్ రీజన్ అండ్ జస్టిస్ పార్టీ (బిఎస్‌డబ్లు) సహ వ్యవస్థాపకురాలు సారా వాగెన్ కూడా పోటీలో ఉన్నారు. వీరిలో ఎఎఫ్‌డి నాయకురాలు ఎలీస్ వీడెల్, బిఎస్‌డబ్లు సహ వ్యవస్థాపకురాలు సారా మహిళా అభ్యర్థులు, వీరిలో ఎఎఫ్‌డి నాయకురాలు ఎలీస్ వీడెల్‌కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఇటీవల మ్యూనిక్‌కు వచ్చినప్పుడు ఈమెతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యువతలో ఈమెకు పెద్ద క్రేజ్ ఉంది.

వలసలు, ఇమ్మిగ్రేషన్‌కు విరుగుడుగా రిమిగ్రేషన్ (తిరిగి పంపేయడం) చట్టాన్ని తీసుకొస్తానని, జర్మనీపై రష్యా ఆంక్షలు ఎత్తివేసేలా కృషి చేస్తానని, ధ్వంసమైన నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పునరుద్ధరిస్తానని ఎన్నికల హామీలు గుప్పించారు. పర్యావరణ ఉద్యమ నేతగా ప్రఖ్యాతి వహించిన 55 ఏళ్ల రాబర్డ్ హబెక్, గతం లో షోల్జ్ ప్రభుత్వంలో వైస్ ఛాన్స్‌లర్‌గా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. పునరుత్పాదక ఇంధన విధానాలకు పట్టం కడతానని, అధికారంలోకి వస్తే ఉక్రెయిన్‌కు సాయం కొనసాగిస్తానని, అణువిద్యుత్ శక్తి ఉత్పత్తిని తగ్గిస్తానని, పవన విద్యుత్‌ను పక్కన బెడతానని ఎన్నికల ప్రచారం సాగించారు. రష్యాకు మద్దతు పలుకుతూ తూర్పు జర్మనీలో బలమైన ఓటు బ్యాంకు సాధించిన ది సారా వాగెన్ కనెక్ట్ రీజన్ అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థి సారా వాగెన్ కనెక్ట్ తమ పార్టీ ఎఎఫ్‌డికి అసలైన ప్రత్యామ్నాయ పార్టీ అని చెబుతున్నారు.

అయితే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అనుకూలంగా తమ వైఖరి కనిపిస్తుండటంతో ఈ పార్టీ గెలుపు అవకాశాలు సందేహంగా తయారయ్యాయి. క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సిడియు) అధినేత ఫ్రిడిష్ మెర్జ్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపే వీలుంది. 69 ఏళ్ల మెర్జ్ 2002లో ఏంజెలా మెర్కల్ ప్రభుత్వంలో పనిచేశారు, తరువాత రాజకీయాలను వదిలేసి అనేక పెట్టుబడుల బ్యాంకుల బోర్డుల్లో పనిచేశారు. తరువాత మళ్లీ సిడియు పార్టీలో చేరి పార్టీ నాయకత్వ పోరులో 2018లో మెర్కెల్, 2021లో ఆర్మిన్ లాసెట్ చేతిలో ఓటమి పొందారు. దేశ సరిహద్దులను పటిష్టం చేస్తానని, వలసలను కట్టడి చేసేలా శరణార్థి నిబంధనలను కఠినతరం చేస్తానని, పన్నులు తగ్గిస్తానని, సంక్షేమ పథకాల కోసం 50 బిలియన్ యూరోలను ఖర్చు చేయిస్తానని ఎన్నికల హామీలు గుప్పించారు.

సోషల్ డెమొక్రాటిక్ పార్టీ నేత అయిన ఓలాఫ్ షోల్జ్ ఇప్పటికి మూడేళ్లకు పైగా దేశ ఛాన్స్‌లర్‌గా సేవలందించారు. అయితే కూటమి సర్కార్‌ను నిలబెట్టుకోలేకపోయారు. రెండు నెలల క్రితం బలపరీక్షలో ఓడిపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రత్యక్షంగా జర్మనీ ఆర్థిక వ్యవస్థపై విపరీత ప్రభావం చూపించడంతో షోల్జ్ ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింది. అది చివరకు కూలడానికి కారణమైంది. ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సిడియు), మార్కస్ సోడర్ సారథ్యంలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సిఎస్‌యు) కూటమి ఈసారి ప్రజాభిమానంగా బరిలో దిగుతున్నాయి. ఈసారి ఈ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో వలసలు, ఆర్థిక వ్యవస్థ మాత్రమే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. జర్మనీ పార్లమెంట్ పీఠం ( బండేస్టాగ్) పై కూర్చునేది ఎవరనే అంశం ఇప్పుడు జర్మనీ అంతటా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News